NEET EXAM | నీట్ పరీక్షను రద్దు చేయలేం … సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు
తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్న నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పేపర్ లీక్, ఇతర మాల్‌ప్రాక్టీసులు ఒక పద్ధతిప్రకారం జరిగాయనేందుకు ఎలాంటి వివరాలు లేవని పేర్కొన్నది.

న్యూఢిల్లీ : తీవ్ర అవకతవకలు చోటు చేసుకున్న నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హజారిబాగ్, పాట్నా ప్రాంతాల్లో నీట్ పరీక్ష పత్రం లీకైందనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం.. మిగిలిన ప్రాంతాల్లో పేపర్ లీక్, ఇతర మాల్‌ప్రాక్టీసులు ఒక పద్ధతి ప్రకారం జరిగాయనేందుకు ఎలాంటి వివరాలు లేవని పేర్కొన్నది. గత నాలుగు రోజులుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం ఈ విషయంలో కేంద్రం, ఎన్డీయే తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహా సీనియర్ అడ్వొకేట్లు నరేందర్ హుడా, సంజయ్ హెగ్డే, మాథ్యూస్ నెడుమాప్ర తదితర అనేక మంది వాదనలను విన్నది. 20 లక్షలకు మందికిపైగా విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్పులోని ఆపరేటివ్ పార్ట్‌ను ప్రకటిస్తున్నామని, పూర్తి తీర్పు తదుపరి వెలువరిస్తామని ధర్మాసనం తెలిపింది. హజారిబాగ్, పాట్నా ప్రాంతాల్లో నీట్ పరీక్ష పత్రం లీకైందనడంలో ఎలాంటి సందేహం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సమయంలో ‘నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను నీరుగార్చినట్టు గానీ లేదా పద్ధతి ప్రకారం ఉల్లంఘించినట్టుగానీ నిర్ధారణకు వచ్చేందుకు తగిన మెటీరియల్ ఏమీ లేదు’ అని సీజేఐ చంద్రచూడ్ అన్నారు.
మే 5వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష పత్రాలు లీకైన విషయంలో కేంద్ర ప్రభుత్వం, పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీయే రాజకీయ వివాదానికి కేంద్ర బిందువులుగా మారాయి. పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. నీట్ యూజీ పరీక్షను ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించారు. ఈ పరీక్షకు 23.33 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికి దేశవ్యాప్తంగా 571 నగరాలు, 14 ఓవర్సీస్ ప్రాంతాలు సహా 4700 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.