Dalit Student | చరిత్ర సృష్టించిన దళిత విద్యార్థి.. ఆ గ్రామంలో పది పాసైన తొలి బాలుడు ఇతనే
Dalit Student | ఓ దళిత విద్యార్థి( Dalit Student ) చరిత్ర సృష్టించాడు. స్వాతంత్య్రం అనంతరం ఆ గ్రామంలో పది పాసైన( Tenth Pass ) బాలుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. ప్రతి రోజు పదుల కిలోమీటర్ల నడిచి.. చదువుకుని పది పాసయ్యాడు. మరి ఆ విద్యార్థి ఎవరు..? అతని కన్నీటి గాథ తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని ఓ దళిత వాడకు వెళ్లాల్సిందే.

Dalit Student | ఓ దళిత విద్యార్థి( Dalit Student ) చరిత్ర సృష్టించాడు. స్వాతంత్య్రం అనంతరం ఆ గ్రామంలో పది పాసైన( Tenth Pass ) బాలుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని.. ప్రతి రోజు పదుల కిలోమీటర్ల నడిచి.. చదువుకుని పది పాసయ్యాడు. మరి ఆ విద్యార్థి ఎవరు..? అతని కన్నీటి గాథ తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని ఓ దళిత వాడకు వెళ్లాల్సిందే.
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని నిజాంపూర్ గ్రామం అది. ఆ గ్రామంలో కేవలం 25 దళిత కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అందరూ చదువుకు దూరమే. కానీ రామ్‌కేవాల్(15) అనే బాలుడు మాత్రమే చదువుకున్నాడు. పదో తరగతి 53 శాతం ఉత్తీర్ణతతో సెకండ్ డివిజన్‌లో పాసయ్యాడు. దీంతో స్వాతంత్య్రం అనంతరం అంటే 78 ఏండ్ల తర్వాత ఆ గ్రామంలో పదో తరగతి పాసైన విద్యార్థిగా రామ్‌కేవాల్ చరిత్ర సృష్టించి, రికార్డుల్లోకి ఎక్కాడు.
రామ్‌కేవాల్ తల్లిదండ్రులు దినసరి కూలీలు. ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరిమణులు ఉన్నారు. ఒక సోదరికి వివాహం కాగా, మరో సోదరి ఒకటో తరగతి చదువుతుంది. సోదరుల్లో ఒకరు తొమ్మిది, మరొకరు ఐదో తరగతి చదువుతున్నారు. రామ్‌కేవాల్ తన సొంతూరిలో ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆరు నుంచి ఎనిమిది వరకు మరో ఊరిలో, తొమ్మిది, పది తరగతులో అహ్మదపూర్ గవర్నమెంట్ ఇంటర్ కాలేజీలో చదివాడు. ఇక సమయం దొరికినప్పుడల్లా కూలీ పనులు చేసుకుంటూ తన విద్యను కొనసాగించాడు.
ఈ సందర్భంగా రామ్‌కేవాల్ మాట్లాడుతూ.. మా ఇంట్లో విద్యుత్ సరఫరా కూడా లేదు. ఎందుకంటే కరెంట్ బిల్లు కూడా చెల్లించలేదని దుస్థితి మాది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోలార్ వీధి లైట్ల కింద కూర్చొని చదువుకునేవాడిని. కనీసం తిండి కూడా సరిగా తినలేని పరిస్థితి. కట్టుకునేందుకు బట్టలు కూడా లేవు. కనీసం నాకు చెప్పులు కూడా లేవు. చెప్పుల్లేకుండానే స్కూల్‌కు నడుచుకుంటూ వెళ్లేవాడిని. ఇక పది పాసైన తర్వాత నా పేరు మా జిల్లాలో మార్మోగింది. జిల్లా కలెక్టర్ పిలిపించుకుని సన్మానం చేశాడు. మా స్కూల్ ప్రిన్సిపల్ వీకే గుప్తా నాకు కొత్త బట్టలు, బూట్లు ఇప్పించాడు. కొత్త బట్టలు, షూ వేసుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్లడం చాలా సంతోషం అనిపించింది. ఇక స్కూల్ లేనప్పుడు, రాత్రి వేళ పెళ్లి వేడుకలకు హాజరై.. డెకరేషన్ పనుల్లో నిమగ్నమయ్యేవాడిని. డెకరేషన్ పనులకు వెళ్తే రూ. 200 నుంచి రూ. 300 వచ్చేవి. వాటితో పుస్తకాలు కొనుక్కునేవాడిని. ఫీజులు కట్టుకునేవాడినని రామ్‌కేవాల్ కన్నీటి పర్యంతమయ్యాడు.