బీజేపీ ఎంపీ అభ్యర్థి అశ్లీల వీడియో.. పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటన
ఉత్తరప్రదేశ్‌లోని బరబంకీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన ఆ పార్టీ సిటింగ్ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు

ఉత్తరప్రదేశ్‌లోని బరబంకీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన ఆ పార్టీ సిటింగ్ ఎంపీ ఉపేంద్ర సింగ్ రావత్ పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. బీజేపీ ప్రకటించిన 195 పేర్లతో కూడిన జాబితాలో ఆయన పేరు ఉన్నది. అయితే.. ఆయనకు చెందినదిగా చెబుతూ ఒక అశ్లీల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన నేపథ్యంలో పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించారు.
అయితే.. తనను అభ్యంతరకరంగా చూపించిన వీడియో డీప్ ఫేక్ ఏఐ వీడియోగా ఆయన అభివర్ణించారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశానని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దీనిపై దర్యాప్తు జరిపించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడిని కోరానని పేర్కొన్నారు. తాను నిర్దోషినని తేలేంత వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీచేయబోనని స్పష్టం చేశారు. రావత్ పేరును ప్రకటించిన అనంతరం ఆయనదిగా చెబుతూ ఒక వీడియో బయటకు వచ్చింది. అందులో ఒక వ్యక్తి మరో మహిళతో అభ్యంతరకర స్థితిలో కనిపించారు.