ఒకే ఇంట్లో 69 ఓట్లు.. బండి గెలుపుపై మహేశ్‌గౌడ్‌ సందేహం

తెలంగాణలో బీజేపీ ఎనిమిది ఎంపీల గెలుపు వెనుక పీసీసీ చీఫ్ బి. మహేశ్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలకు బీజేపీ కౌంటరిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది ఎంపీ సీట్లు ఎలా గెలిచారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ప్రశ్నించారు

ఒకే ఇంట్లో 69 ఓట్లు.. బండి గెలుపుపై మహేశ్‌గౌడ్‌ సందేహం
  • ఒకే ఇంట్లో 69 ఓట్లు
  • బండి గెలుపుపై మహేశ్‌గౌడ్‌ సందేహం
  • ఓట్ల చోరీపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 25 (విధాత): కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ లేవనెత్తి ఓట్ల చోరీ అంశం తెలంగాణకు కూడా పాకింది. ఓట్ల చోరీపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణలో బీజేపీ ఎనిమిది ఎంపీల గెలుపు వెనుక పీసీసీ చీఫ్ బి. మహేశ్ కుమార్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలకు బీజేపీ కౌంటరిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది ఎంపీ సీట్లు ఎలా గెలిచారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ప్రశ్నించారు.

రెండు వారాల క్రిత ఓట్ల చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో వివరించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. తప్పుడు ఆరోపణలు చేశారని ఎన్నికల సంఘం మండిపడింది. ఈ ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ అఫిడవిట్ సమర్పించాలని ఈసీ కోరింది. రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన రెండు రోజులకే బీజేపీకి చెందిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అయిలాపూర్ గ్రామంలో 700 దొంగఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై గతంలో కూడా ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన జనహిత యాత్రలో భాగంగా కరీంనగర్ లో పర్యటించిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో 8 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. కరీంనగర్ లో బండి సంజయ్ కు భారీ మెజారిటీ రావడంతో పాటు నిజమాబాద్ లో అరవింద్ గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఇద్దరితో పాటు మిగిలిన ఆరుగురు ఎంపీల గెలుపుపై ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఎలా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. దీనిపై మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. మహేశ్ గౌడ్ ఆరోపణలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు కౌంటరిచ్చారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఓటు చోరీ అంటున్నారని… కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీల గెలుపు కూడా ఓట్ల చోరీతోనే జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. ఏ ఓటర్ లిస్టుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే ఓటర్ జాబితాతో తమ పార్టీ నుంచి 8 మంది గెలిచారని అన్నారు.