వేల కోట్ల లిక్కర్ కుంభకోణానికి ఫుల్‌స్టాప్‌.. లిక్కర్‌ కంపెనీల విరాళాలకు చెక్‌

తమిళనాడులో లిక్కర్ కంపెనీల నుంచి ఎక్సైజ్ విభాగం ప్రతి నెలా కొనుగోళ్లు చేస్తుంటుంది. ఇలా కొనుగోలు చేసిన మద్యాన్ని ప్రభుత్వ ఆధీనంలోని టాస్మాక్ (తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా విక్రయిస్తుంటుంది. తమిళనాడులో మొత్తం 4,048 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఎక్కడా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకుండా ఎక్సైజ్ శాఖ టాస్మాక్ ద్వారా హోల్ సేల్, రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్నది. టాస్మాక్ ద్వారా గత ప్రభుత్వ పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెలుగు చూసింది. అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం ఈ నెట్‌వర్క్‌ను చేధించి, లిక్కర్ కంపెనీలు ఇచ్చే పార్టీ ఫండ్ తీసుకోవద్దని నిర్ణయించింది.

తమిళనాడులో గత ఐదేళ్లుగా అధికార పార్టీకి లిక్కర్ కంపెనీల ఉదార విరాళాలకు ప్రభుత్వం చెక్‌ పెట్టింది. లిక్కర్‌ కంపెనీల నుంచి సాగే మామూళ్ల దందాపై కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఉక్కుపాదం మోపారు. ప్రతి బాటిల్‌పై కమీషన్‌తోపాటు మద్యం కొనుగోళ్లలో అధిక ధరలను నియంత్రించాలని టీవీకే ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నెలా లిక్కర్ కంపెనీలు ప్రభుత్వ పెద్దలకు రూ.102 కోట్లు చొప్పున ఐదేళ్లలో సుమారు పదహారు వందల కోట్లు పార్టీ ఫండ్ చెల్లిస్తున్నాయి. ఇక నుంచి ఇలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని, ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకే చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదే తరహాలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో లిక్కర్ కమీషన్లు అందుతున్నాయా అంటే అవుననీ కానీ కాదని కానీ చెప్పలేము. దేశంలో ఎక్కడా లేని మద్యం ధరలు రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు అవుతున్నాయి. నకిలీ మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతుందనే విమర్శలు మద్య ప్రియుల నుంచే వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడులో సంచలన రీతిలో తొలిసారి అధికారంలోకి వచ్చిన టీవీకే ప్రభుత్వం.. 717 మద్యం దుకాణాలను జూన్ 5వ తేదీన పూర్తిగా మూసివేసింది. విద్యాసంస్థలు, ఆలయాలు, మసీదులు, చర్చీలకు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న టాస్మాక్ (తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్) దుకాణాలను మూసివేయాలని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

కమీషన్ల కుంభకోణం…

ఎక్సైజ్ శాఖ ప్రతి నెలా లిక్కర్ కంపెనీల నుంచి లిక్కర్, వైన్, బీర్లను కొనుగోలు చేస్తున్నది. ఒక లిక్కర్ కేసుపై రూ.90, బీర్ కార్టన్ పై రూ.40, వైన్ కార్టన్‌పై రూ.20 చొప్పున కమీషన్ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్ద హుకుం జారీ చేశారని సమాచారం. ప్రతి సంవత్సరం తమిళనాడు ప్రభుత్వం 88 లక్షల లిక్కర్ కేసులు కొనుగోలు చేస్తుండేది. ఆ ప్రకారం మద్యం కంపెనీలు కొనుగోలు ప్రకారం ప్రభుత్వ పెద్దకు కమీషన్ చెల్లించేవి. టాస్మాక్ దుకాణాలలో ప్రతి బాటిల్ పై రూ.10 చొప్పున అదనంగా డిపాజిట్ మొత్తాన్ని వినియోగదారుల నుంచి తీసుకుని ఇస్తుండేవి. మద్యం తాగిన తరువాత కొనుగోలుదారుడు బాటిల్‌ను తిరిగి అప్పచెబితే అదనంగా తీసుకున్న రూ.10లు వాపస్‌ చేయాలి. కానీ ఏ ఒక్క దుకాణంలో తిరిగి చెల్లించినట్లు రికార్డులు లభ్యం కాలేదు. ఇలా ప్రతి నెలా రూ.300 కోట్ల చొప్పున సంవత్సరానికి రూ.3,600 కోట్లు వసూలు చేసి, ఆ మొత్తాన్ని ప్రభుత్వ పెద్ద తన జేబులో వేసుకున్నారనేది అభియోగం. ఈ అవినీతిలో భాగం అయినందుకు నజరానాగా ఎక్సైజ్ ఉద్యోగులకు బాటిల్ కమీషన్లు అందుతుండేవన్న విమర్శలు ఉన్నాయి. ఇదే కాకుండా ఎమ్మార్పీ ప్రకారం ఎక్కడా విక్రయాలు జరగడం లేదని ప్రాథమిక విచారణలో వెల్లడి అయ్యింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న విజయ్‌ ప్రభుత్వం.. కమీషన్ల రూపంలో అధికార పార్టీకి అందే ఫండ్‌ను నిరాకరించింది.

Latest News