Operation Sindoor | మాట్లాడితే చరిత్ర తిరగేస్తారు.. పదకొండేళ్లుగా అధికారంలో మీరే.. జవాబు చెప్పండి : లోక్‌సభలో సర్కారుపై ప్రియాంక ఫైర్‌

దేశంలో ఏ ఘటన చోటు చేసుకున్నా తమ కుటుంబం పేర్లను ప్రస్తావిస్తున్నారని వాయనాడ్‌ కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ అమిత్‌షాపై విరుచుకుపడ్డారు. పహల్గాం భద్రతా వైఫల్యానికి కారణమేంటని ప్రశ్నిస్తే దానికి మాత్రం జవాబు చెప్పరని మండిపడ్డారు. పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారన్న ప్రియాంక.. ఘటనపై బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Operation Sindoor | మాట్లాడితే చరిత్ర తిరగేస్తారు.. పదకొండేళ్లుగా అధికారంలో మీరే.. జవాబు చెప్పండి : లోక్‌సభలో సర్కారుపై ప్రియాంక ఫైర్‌

Operation Sindoor |  పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో 26 మంది చనిపోవడానికి కారణమైన భద్రతా వైఫల్యాన్ని (security failure) మిలిటరీ ఆపరేషన్ల లెక్కల మాటున దాచివేయజాలమని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ (priyanka gandhi) అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌(operation sindoor)పై చర్చలో ప్రియాంక మంగళవారం లోక్‌సభ(lok sabha)లో ప్రసంగించారు. ఆమె పేరు ప్రకటించగానే.. అధికార పక్షం సభ్యులు ‘హిందూ’ అంటూ అరిచారు. దీనికి ఆమె దీటుగా కౌంటర్‌ ఇస్తూ.. ‘భారతీయ’ అని స్పందించారు. ‘ఆ రోజు 25 భారతీయ కుటుంబాలు నష్టపోయాయి. వారికి ఎలాంటి రక్షణ లేదు. ఎన్ని ఆపరేషన్లు నిర్వహించినా ఈ వాస్తవాన్ని దాచిపెట్టలేరు. ఆ కుటుంబాలకు మనమంతా జవాబుదారీ. వాస్తవాలు తెలుసుకునే హక్కు ఆ కుటుంబాలకు ఉంది’ అని ప్రియాంక గాంధీ చెప్పారు. అయితే.. ‘ఈ ప్రశ్నలకు సమాధానాలను దాచి పెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభలో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. పహల్గామ్‌ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను హతమార్చిన విషయాలు ప్రస్తావిస్తూ తనదైన ధోరణిలో 1948 నుంచి 1962లో భారత్‌, చైనా యుద్ధం వరకూ దేశ తొలి ప్రధాన మంత్రిదే బాధ్యతని ఆరోపించారు. 2004 నుంచి 2014 మధ్య యూపీఏ పాలనా కాలంలో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడులను కూడా అమిత్‌షా ప్రస్తావించారు. అమిత్‌ షా ప్రసంగాన్ని ప్రస్తావించిన ప్రియాంక.. ‘ఆయన యూపీఏ పాలన కాలంలో చోటు చేసుకున్న 25 దాడులను తెలియజేశారు. పహల్గామ్‌ దాడికి తమదే బాధ్యత అని ప్రకటించుకున్న టీఆర్‌ఎఫ్‌.. 2020 ఏప్రిల్‌ నుంచి పహల్గామ్‌ ఘటన వరకూ 20 దాడులకు పాల్పడింది. ముంబై దాడుల సందర్భంగా ఒక్క ఉగ్రవాది తప్ప ఆ దాడికి పాల్పడిన అందరినీ అప్పుడే చంపేశారు. ఆ దాడి నేపథ్యంలో అప్పటి కేంద్ర హోం మంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ పదవులకు రాజీనామాలు చేశారు’ అని ప్రియాంక చెప్పారు. ‘దేశంలో ఒక సంఘటన జరిగిన వెంటనే నా కుటుంబ సభ్యుల పేర్లను ఆయన ప్రస్తావిస్తారు. మీరు 11 ఏళ్లుగా అధికారంలో ఉన్నారు. మీ కళ్ల ముందు జరిగిన దానికి మీరు బాధ్యత వహించాల్సిన సమయం ఇది’ అని అమిత్‌షానుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వాటి సంగతేంటి?

మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత చోటు చేసుకున్న పఠాన్‌కోట్‌, యురి, పుల్వామా దాడులను ప్రియాంక ప్రస్తావించారు. ‘ఇప్పటి రక్షణ మంత్రి అప్పటి హోం మంత్రి. ఇప్పటి హోం మంత్రి హయాంలో మణిపూర్‌ మండిపోతున్నది. అయినా.. ఆయన (అమిత్‌షా) రాజీనామా చేయలేదు’ అని రిటార్టిచ్చారు. ‘బాధ్యతను అంగీకరించేందుకు నరేంద్రమోదీ సారథ్యంలోని ప్రభుత్వం తిరస్కరిస్తున్నది’ అని ప్రియాంక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సమాధానం ఎందుకు చెప్పరు?

‘బాంబుదాడులు పత్రికల్లో పతాకశీర్షికలుగా ఉంటాయి. కానీ.. లోపాల్లోనే అసలు కథ ఉంటుంది. ఏప్రిల్‌ 22న ఏం జరిగింది? ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పరు. బైసరన్‌ లోయలో ఒక్కరంటే ఒక్క సైనికుడు ఎందుకు లేరు? ఎందుకు అక్కడ వైద్య సదుపాయాలు లేవు? ఆయన (అమిత్‌షా) చరిత్ర పేజీల్లోకి వెళ్లిపోతుంటారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, నా తల్లి కన్నీళ్లు..! కానీ.. ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పరు’ అని అన్నారు.
నాయకత్వం అంటే క్రెడిట్‌ తీసుకోవడమే కాదని, బాధ్యతను అంగీకరించడం కూడానని ప్రియాంక హితవు పలికారు. ‘ఇది బంగారం కాదు.. ముళ్ల కిరీటం. ఆపరేషన్‌ సిందూర్‌ క్రెడిట్‌ తనకు దక్కాలని మోదీ కోరుకుంటున్నారు. ఒలింపిక్స్‌లో భారతీయ క్రీడాకారులు మెడల్స్‌ గెలిస్తే దానికి ఆయన క్రెడిట్‌ తీసుకుంటారు. క్రెడిట్‌ తీసుకున్నత మాత్రాన నాయకుడైపోరు. జవాబుదారీ తనం కూడా ఉండాలి. ఈ ప్రభుత్వ రాజకీయ పిరికితనం ఏ స్థాయిలో ఉన్నదంటే.. ఏ ఒక్కరూ బాధ్యత తీసుకోవడం లేదు’ అని ప్రియాంక విమర్శించారు.

అసంపూర్ణంగా ఆపరేషన్‌ సిందూర్‌

ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యం ఇంకా పూర్తి కాలేదని ప్రియాంక గాంధీ అన్నారు. అది (ఆపరేషన్‌ సిందూర్‌) పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పేందుకే అయితే.. అది ఇంకా అసంపూర్ణంగానే ఉన్నదని చెప్పారు. ‘వారి సైనిక జనరల్‌ అమెరికా అధ్యక్షుడితో కలిసి లంచ్‌ చేస్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్‌.. అదే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతా మండలిలో ఉగ్రవాద వ్యతిరేక గ్రూప్‌ చైర్‌గా ఉంటుంది’ అని నిప్పులు చెరిగారు.