Shivraj Singh Chouhan | మోదీ, అమిత్‌షా.. మధ్యలో చౌహాన్!.. బీజేపీ అధ్యక్ష రేసులో ఎంపీ మాజీ సీఎం

Shivraj Singh Chouhan | బీజేపీ తదుపరి అధ్యక్షుడిని ఎంపిక చేసుకునేందుకు ఆ పార్టీ తీవ్ర మేధోమథనమే చేస్తున్నది. వచ్చే అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరించకుండా, తమకు గట్టి మద్దతుదారుడిగా ఉండాలనేది మోదీ, అమిత్‌షా అభిప్రాయంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ క్రమంలో వారి ఆలోచనలకు భిన్నంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. అధ్యక్ష రేసులోకి వచ్చినట్టు వారు అభిప్రాయపడుతున్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరిట శివరాజ్ సింగ్ చౌహాన్ సుదీర్ఘ యాత్రను సెహోర్ నుంచి ప్రారంభించారు. అధ్యక్ష రేసులో తాను ఉన్నాననే విషయాన్ని చాటుకునేందుకు ఈ యాత్ర చేపట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిజిటల్ హంగామా చేసే బీజేపీ అగ్రనాయకత్వంతో పోల్చితే శివరాజ్‌సింగ్ చౌహాన్ గ్రామీణ ప్రాంత నాయకుడి తరహాలో ఉంటారు. ప్రజలతో కలిసిపోతారు. మధ్యప్రదేశ్‌నే తీసుకుంటే అక్కడి ప్రజలతో భావోద్వేగపూరిత సంబంధాలు ఉన్నాయనే మాట వినిపిస్తూ ఉంటుంది.
సరిగ్గా బీజేపీ అగ్రనాయకత్వం జాతీయ వాదం, ఆపరేషన్ సిందూర్‌లో భారత ఆర్మీ సాధించిన ఘనతలు, భారత శక్తిని చాటిన తీరును చాటుకునే ప్రయత్నంలో బిజీగా ఉంటే.. శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం.. తనదైన శైలిలో ప్రశాంతంగా పాద యాత్రకు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన నాలుగు విడతలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. మోదీకి ముందు అందరి ఆమోదం ఉన్న ప్రధాన మంత్రి అభ్యర్థి అనే అభిప్రాయాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. కానీ.. మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఆయన ప్రాభవం తగ్గించేశారన్న వాదనలూ వచ్చాయి. ఇప్పుడు కేంద్రంలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు.
మే 25వ తేదీన తన సొంత జిల్లా అయిన సెహోర్ నుంచి ప్రజలతో మమేకమయ్యేందుకు సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. వికిసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అని పేరు పెట్టినా.. దీనికి రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఉందని పరిశీలకులు అంటున్నారు. 2029 తర్వాత పగ్గాలు ఎవరికి అనే చర్చ సాగుతున్న తరుణంలో ఢిల్లీలోని బీజేపీ శక్తుల కారిడార్లలో తన పటిమను చాటుకునే ప్రయత్నం ఇందులో కనిపిస్తున్నదని చెబుతున్నారు. ఇది సాదాసీదా వ్యక్తిగత కార్యక్రమం కానే కాదని అంటున్నారు. చౌహాన్ బలమైన జాతీయవాద నాయుకుడిగా చాటు కోవడం లేదని, బీజేపీ అగ్రనాయకత్వం తరచూ పలవరించే డిజిటల్ భాషలు కూడా మాట్లాడటం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వాటికి బదులు ఒకప్పుడు బీజేపీలో కీలక విధానంగా ఉన్న, ఇప్పుడు సోయిలో కూడా లేని ముఖాముఖి చర్చలు, మనుషులకు పలకరింపులు, భావోద్వేగ సంబంధాలు కొనసాగింపు వంటివాటికి ఆయన తిరిగి వస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు దేశంలో ప్రత్యేకించి బీజేపీలో కమాండ్ కంట్రోల్ సమాచార వ్యవస్థ, కరడుగట్టిన జాతీయవాద పోకడలు కనిపిస్తున్న సమయంలో బీజేపీ యొక్క సున్నిత, మృదువైన, సహానుభూతితో సాధారణ ప్రజల్లో తన విశ్వాసాన్ని నిర్మించుకుంటున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీలో కీలక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలాన్ని పొడిగించినా.. అది కూడా ముగింపునకు చేరుకున్నది. ఈ దశలో ఉద్దేశపూర్వకంగానే కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో మోదీ, అమిత్‌షా నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. దానికి ప్రత్యేక కారణం.. రాబోయే అధ్యక్షుడు.. 2029 ఎన్నికల్లో కేంద్ర బిందువుగా మారేందుకు అధికంగా ఉన్న అవకాశాలే. ఈ విషయం బాగా తెలిసిన మోదీ, అమిత్‌షా.. సమాంతర కేంద్రాన్ని ప్రోత్సహించేందుకు సిద్ధంగా లేరన్న చర్చ జరుగుతున్నది. ఆ క్రమంలోనే సాగదీస్తున్నట్టు కనిపిస్తున్నది.
ఈ దశలో బీజేపీలో కీలక స్థాయిలో ఒక శూన్యత నెలకొన్నది. ఇప్పుడు శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆ శూన్యాన్ని తాను భర్తీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెబుతున్నారు. అధిష్ఠానంతో ఎలాంటి ఘర్షణ పూరిత వైఖరిని అనుసరించకుండా.. పత్రికా ప్రకటనలు, టీవీ ఇంటర్వ్యూలతో చెలరేగిపోకుండా.. పావులు కదుపుతున్నారు. శివరాజ్‌సింగ్ పట్ల ఆరెస్సెస్‌లోని గణనీయమైన భాగం సానుకూలతతో ఉన్నట్టు తెలుస్తున్నది. సైద్ధాంతిక, ఆధునిక రాజకీయ, ప్రజామోదం ఉన్న లక్షణాల మేలు కలయికగా అనేక మంది ఆరెస్సెస్ నాయకులు శివరాజ్‌సింగ్‌ను అభివర్ణిస్తున్నారు. ఇది ఆయనకు ఒక ప్లస్ పాయింట్ అవుతుందనే చర్చలు వినిపిస్తున్నాయి. నిజానికి పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను బీజేపీ కొనసాగిస్తున్నది. అయితే.. మధ్యలో పహల్గామ్ దాడి, అనంతరం ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాలు.. ఆ ప్రక్రియకు తాత్కాలిక బ్రేకులు వేశాయి. 29 రాష్ట్రాలకు గాను ఇప్పటికే 15 రాష్ట్రాలకు అధ్యక్షులను ఎంపిక చేసింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి అవసరమైన కోరంలో 12 మంది రాష్ట్ర అధ్యక్షులు ఉంటే సరిపోతుంది.
కొత్తగా పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న వారితో పోల్చితే చౌహాన్‌కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. సంఘ్ సంస్థాగత సంస్కృతి మూలాలు చౌహాన్‌లో ఉన్నాయి. ఏబీవీపీ నేత స్థాయి నుంచి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగిన నాయకుడు చౌహాన్. సీనియర్ ప్రచారక్‌లతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మోదీ, షా అనంతర కాలంలో పార్టీని సంస్థాగతంగానే కాకుండా సామాజిక కోణంలోనూ ముందుకు తీసుకువెళ్లగల నాయకత్వం అవసరమనే అభిప్రాయాన్ని ఆరెస్సెస్ అధినాయకత్వం వ్యక్తం చేస్తున్న తరుణంలో అందుకు చౌహాన్ అన్ని విధాలుగా తగిన నేత అని అంటున్నారు. అయితే.. తమకు అనుకూలంగా ఉండి, తమ ఆదేశాలను పాటించడమే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడాన్ని సహించని మోదీ, అమిత్ షా.. శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను భావి నాయకుడిగా అంగీకరిస్తారా? అనేదే అసలు సమస్య అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండే చౌహాన్.. బీజేపీ అగ్రనాయకత్వం కోటరీలో కూడా లేని విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. చౌహాన్ వ్యవహార శైలి ఆరెస్సెస్ నాయకత్వానికి నచ్చినా.. ఇప్పుడు పార్టీని డామినేట్ చేస్తున్న మోదీ, అమిత్‌షా నిర్ణయాలకు వ్యతిరేకంగా సంఘ్ వ్యవహరించగలదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.