న్యూఢిల్లీ : పారమెంట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలను నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ శీతాకాల సమావేశాలను 2025 డిసెంబర్ 1 నుంచి 19 వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల తీరును బట్టి తేదీల్లో మార్పులు ఉండొచ్చు’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజాస్వామ్య బలాన్ని మరింతగా పెంపొందించే నిర్మాణాత్మక, సార్థకమైన సమావేశాలు జరగాలని ఆశిస్తుస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశాల్లో అమెరికా సుంకాలతో పాటు ఇతర అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే, ప్రతి పక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్రంపై ఓటు చోరి లాంటి అంశాలపై నిలదీసేందుకు రెడీగా ఉంది.
