Indo Pak War | 2025లోనే భారత్‌, పాక్ యుద్ధం.. 2019లో ఎలా చెప్పారు? అణ్వాయుధాల వాడకంపై ఏమ‌న్నారంటే?

అణు సంపత్తి కలిగిన భారత్‌, పాక్‌ మధ్య యుద్ధంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2019 నాటి ఒక నివేదిక ఒకటి రెండు దేశాల మధ్య అణు యుద్ధం చోటు చేసుకుంటే సంభవించే దుష్పరిణామాలను కళ్లకు కట్టింది.

Indo Pak War | 2025లోనే భారత్‌, పాక్ యుద్ధం.. 2019లో ఎలా చెప్పారు? అణ్వాయుధాల వాడకంపై ఏమ‌న్నారంటే?
  • ఏదైనా దేశం అణ్వాయుధాలు వాడితే?
  • తక్షణం పది కోట్ల మంది మృత్యువాత
  • తదుపరి ఐదు నుంచి 12.5 కోట్ల చావులు
  • ప్రపంచవ్యాప్తంగా దుష్పరిణామాలు
  • కోలుకోవడానికి కనీసం పదేళ్లు

Indo Pak War |  యుద్ధం తప్పదా? ఇప్పుడు భారత్‌, పాకిస్తాన్‌ ఉద్రిక్తతల నడుమ ఏ నలుగురి మధ్య ఈ చర్చ వచ్చినా.. తలెత్తుతున్న సందేహం. పహల్గామ్‌ దాడి తర్వాత భారత్‌ తీవ్ర దౌత్య చర్యలు, సమయం, టార్గెట్‌ల ఎంపిక, వ్యూహాలపై సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఉందంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు, అరేబియా సముద్రంలో నౌకాదళ విన్యాసాలు యుద్ధ సంభావ్యతను సూచనప్రాయంగానే అయినా స్పష్టంగానే వెల్లడిస్తున్నాయి. యుద్ధం జరిగితే ఏ స్థాయిలో ఉంటుందనేది ఒక అంచనా.

అందులోనూ రెండు అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశాలు. ఈ నేపథ్యంలో ఒక నివేదిక రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలపై అధ్యయనం చేసింది. 2025లోనే రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని 2019లోనే అంచనా వేసింది. యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో శాస్త్రవేత్తల నాయకత్వంలో రట్జర్స్ వర్సిటీ పరిశోధకులతో కలిసి ఈ అధ్యయనం చేశారు. దాని వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ వివరాలతో వియాన్‌ న్యూస్‌ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.

యూఎస్‌ నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్, ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ రియో ​​గ్రాండే, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎట్ లాస్ ఏంజిల్స్ నుంచి ఇన్‌పుట్‌లను ఈ అధ్యయనానికి ఉపయోగించారు. అణు యుద్ధంపై హెచ్చరికలు చేసేందుకు, అణు యుద్ధాలకు వ్యతిరేకంగా ఉన్న గ్లోబల్‌ కన్వెన్షన్స్‌ ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పేందుకు ఈ అధ్యయనాన్ని ఉద్దేశించారు. అణ్వాయుధాల వాడకాన్ని నిషేధిస్తున్న 2017 నాటి ఐరాస ఒప్పందపు ప్రాముఖ్యాన్ని ఈ అధ్యయనంలో ప్రధానంగా ప్రస్తావించారు.

ఆ సమయానికి ఉన్న డాటా ఆధారంగా ఈ అంచనాలను అధ్యయన నివేదిక రచయితలు రూపొందించారు. అణుయుద్ధమే జరిగితే భారత్‌, పాకిస్తాన్‌ దేశాలు, ఈ ప్రాంతానికే కాకుండా ప్రపంచ స్థాయిలో చోటు చేసుకునే తీవ్ర పర్యవసనాలను ఉదహరించారు. 2019 నాటి ఈ అధ్యయనంలో.. భారత్, పాకిస్తాన్‌ మధ్య అణు యుద్ధం సంభవిస్తే తక్షణం పది కోట్ల మంది మృత్యువాత పడతారని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తంగా ఐదు కోట్ల నుంచి 12.5 కోట్ల వరకూ దాని ప్రభావంతో తదుపరి కాలంలో చనిపోతారని తెలిపింది. ఇది రెండు దేశాలు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను (భారత్‌ వద్ద 100, పాకిస్తాన్‌ వద్ద 150 అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా) ఉపయోగిస్తే ఏం జరుగుతుందనే అంశంలో కంప్యూటర్‌ సిమ్యులేషన్‌ ఆధారంగా ఆ అధ్యయనం పేర్కొన్నది.

ఈ అణు యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఆహార లేమి ఏర్పడి మరిన్ని మరణాలకు దారి తీస్తుందని అధ్యయనం తెలిపింది. ‘బాంబు పడిన ప్రదేశాల్లోనేకాదు.. యావత్‌ ప్రపంచం మీద దాని పర్యవసానాలు ఉంటాయి’ అని రట్జర్స్ వర్సిటీ పర్యావరణ శాస్త్రాల విభాగానికి చెందిన అలన్‌ రోబాక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అధ్యయనంలో ఆయన కూడా భాగస్వామిగా ఉన్నారు. 2025 నాటికి భారత్‌, పాకిస్తాన్‌ వద్ద 500కుపైగా అణ్వాయుధాలు ఉంటాయని 2019నాటి ఈ అధ్యయనం అంచనా వేసింది. భారత్‌, పాకిస్తాన్‌ అత్యంత సమీపంలో ఉన్న అణ్వాయుధ దేశాలుగా భద్రతా విశ్లేషకులు చెబుతూ ఉంటారు.

ఒక్క అణుబాంబును ప్రయోగిస్తే దాని ప్రభావం 15 కిలోమీటర్ల పరిధి వరకూ ఉంటుంది. అది విడుదల చేసే శక్తి.. 15వేల టన్నుల టీఎన్‌టీ. 1945లో హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన బాంబు విడుదల చేసిన శక్తితో సమానం. భారత్‌, పాకిస్తాన్‌ అణుబాంబులను కనుక ప్రయోగించినట్టయితే 16 మిలియన్‌ టన్నుల నుంచి 36 మిలియన్‌ టన్నుల సూట్‌ లేదా బ్లాక్‌ కార్బన్‌ విడుదలవుతుంది. దాని నుంచి వెలువడే పొగ భూమి ఉపరితల వాతావరణాన్ని వారాల వ్యవధిలో కమ్మేస్తుంది.

ఈ సూట్‌.. సోలార్‌ రేడియేషన్‌ను పీల్చుకుని, గాలిని వేడిగా మార్చుతుంది. ఆకాశంలోకి విస్తరించిన పొగ.. సూర్యకాంతిని 35 శాతం వరకూ తగ్గించి వేస్తుంది. ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్‌ మేర పడిపోతాయి. ఆహార పంటల ఉత్పత్తి వృద్ధి 30 శాతం వరకూ పడిపోతుంది. సముద్ర జలాల్లో ఉత్పత్తి (చేపలు వంటి ఆహారం) 15 శాతం క్షీణిస్తుంది. అణుబాంబుల తాలూకు పొగ వాతావరణంలోనే ఉంటుంది కనుక.. ఈ పర్యవసానాలనుంచి కోలుకోవడానికి కనీసం పదేళ్లు పడుతుందని 2019 నాటి అధ్యయనం హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి..

PM MODI | కేంద్రం సంచలన నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ!
BJP | తదుపరి జనగణనలో.. కుల గణన! కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం
Bank Holidays In May 2025 | మే నెల‌లో బ్యాంకుల‌కు 12 రోజులు సెల‌వులు.. జాబితా ఇదే..!