PM MODI | కేంద్రం సంచలన నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ!

  • By: sr    news    Apr 30, 2025 3:32 PM IST
PM MODI | కేంద్రం సంచలన నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ!

విధాత: పహల్గావ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం న్యూఢిల్లీలో జాతీయ భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఎస్), రాజకీయ వ్యవహారాల కమిటీ(సీసీపీఏ), కేంద్ర కేబినెట్ సమావేశం కూడా వరుసగా కొనసాగాయి. ఈ సమావేశాల అనంతరం కేంద్రం జాతీయ భద్రత సలహా బోర్డు పునరుద్ధరణకు నిర్ణయం తీసుకుంది.

ఏడుగురు సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటైంది. బోర్డు సభ్యులుగా మాజీ మిలిటరీ, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులను నియమించారు. పాక్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత సలహా బోర్డు చైర్మన్‌(ఎన్ ఎస్ఏ) గా రా(రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్) మాజీ చీఫ్‌ అలోక్‌ జోషిని నియమించింది.

బోర్డులో మాజీ ఎయిర్ కమాండర్ పీఎం సిన్హా, మాజీ ఆర్మీ కమాండర్ ఏకే సింగ్, నేవీ అడ్మిరల్ ఆఫీసర్ మాంటీ ఖన్నా, రిటైర్డ్ ఐపీఎస్ లు రాజీవ్ రంజన్, మన్మోహన్ సింగ్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ బి.వెంకటేశ్ సభ్యులుగా ఉన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం 2గంటల పాటు సుధీర్ఘంగా సాగింది.

పహల్గామ్ దాడి తర్వాతా వారం రోజులుగా తీసుకున్న నిర్ణయాలను, వాటి అమలను కేబినెట్ భేటీలో చర్చించారు. ప్రధాని మోదీతో హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు విడివిడిగా సమావేశమయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.