Warangal Bhadrakali| భద్రకాళికి కోటి రూపాయలతో రథం

– ఈ నెల 26 నుండి వచ్చే నెల 10 తేదీ వరకు శాకంభరీ నవరాత్రి మహోత్సవాలు
నూతన పాలక మండలి నిర్ణయం
వరంగల్ , విధాత: భద్రకాళికి కంచి కామాక్షి రథాన్ని పోలిన రథాన్ని కోటి రూపాయలతో తయారుచేయించడానికి ఆలయ పాలక మండలి తీర్మానించింది. అమ్మవారి గుడి చుట్టూ మాడవీధుల నిర్మాణం పూర్తవుతున్నందున ఇకపై జరిపే వాహన సేవలు, రథ సేవలను మాడవీధుల గుండానే జరుపుతారు. ఈ నెల 26 నుండి 15 రోజుల పాటు నిర్వహించనున్న శాకంభరీ నవరాత్రి మహోత్సవముల ఏర్పాట్ల గురించి చర్చించడానికి నూతన పాలక మండలి సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ఆలయానికి మాడవీధులు లేనందున ప్రదక్షిణ ప్రాకారంలో ఈ సేవలు నిర్వహిస్తున్నారు. ఇకపై అన్ని సేవలు మాడవీధుల గుండా నిర్వహించనున్నారు. ఈ దిశలో భాగంగా వాహన సేవలు, రథోత్సవం జరుపడానికి కంచి కామాక్షమ్మ రథాన్ని పోలిన రథం చేయడానికి దాదాపు కోటి రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. టేకు కలపతో రథం తయారు చేయించడానికి మండలి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్మాణానికి కావలసిన ప్రభుత్వ అనుమతులు ఆలయ కార్యనిర్వాహక వర్గానికి జారీ చేయించడానికి రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డిని మండలి కోరింది. నిత్య పూజా కాల సమయాలైన ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మహా పూజానంతరం ఉచిత ప్రసాద వితరణ చేయడానికి తీర్మానించారు.
అమ్మవారి ప్రసాద వితరణ కోసం ఒక శాశ్వత నిధిని బ్యాంకులో ఏర్పాటు చేయడానికి విరాళాలు ఇవ్వాలని మండలి భక్తులను కోరింది.ఈ నెల 26 నుండి వచ్చే నెల 10 తేదీ వరకు శాకంభరీ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించుటకు అవసరంమైన ఏర్పాట్ల గూర్చి చర్చించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ డాక్టర్ బి. శివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్యనిర్వహణాధికారి కె. శేషుభారతి, పాలక మండలి సభ్యులు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరిరామేశ్వర్రావు, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగు అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్ రావు, ఎక్స్ ఆఫీషియో మెంబర్ పార్నంది నర్సింహమూర్తి, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొన్నారు.