సోదరి ప్రియాంక వెంటరాగా.. వాయనాడ్‌ నుంచి రాహుల్ నామినేషన్‌

  • Publish Date - April 3, 2024 / 04:25 PM IST

కల్పెట్ట: కేరళలోని వాయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ సిటింగ్‌ ఎంపీ రాహుల్‌గాంధీ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఏప్రిల్‌ 26న కేరళ రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం ఈ రాష్ట్రంలో 20 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాయనాడ్‌లో సీపీఐ తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా భార్య అన్నే రాజా, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే సురేంద్రన్‌ బరిలో ఉన్నారు.

ఇదే స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు రాహుల్‌గాంధీ బుధవారం వాయనాడ్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ రేణు రాజుకు కల్పెట్టలోని ఆమె కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను అందించారు. మొత్తం మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను రాహుల్‌ సమర్పించారు. ఆ సమయంలో ఆయన వెంట ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ నేత, తన సోదరి ప్రియాంక గాంధీ, కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బీడీ సతీశన్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు రమేశ్‌ చెన్నతాల, ఎంఎం హసన్‌, ముస్లింలీగ్‌ నాయకుడు పీకే కున్హళికుట్టి తదితరులు ఉన్నారు.

అంతకు ముందు కల్పేటలో రాహుల్‌గాంధీ భారీ రోడ్‌షో నిర్వహించారు. వాయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల మంది పార్టీ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్‌గాంధీ.. వాయనాడ్‌ ఎంపీగా ఉన్నందుకు తనకు ఎంతో గర్వంగా ఉన్నదని చెప్పారు. అటవీ జంతువుల సమస్య సహా వాయనాడ్‌ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇదే స్థానానికి సీపీఐ నాయకురాలు అన్నే రాజా కూడా తన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.

Latest News