Site icon vidhaatha

Rahul Gandhi | యూపీలో ‘ఇండియా’ తుఫాన్.. ఈసారి మోదీ ప్రధాని కాబోవడం లేదు

ఈ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ అతిపెద్ద ఓటమి
రాసి పెట్టుకోండి.. ఆ గ్యారెంటీ నేను ఇస్తా
యూపీ ఎన్నికల సభలో రాహుల్‌గాంధీ

కన్నౌజ్‌ (యూపీ) : ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి తుఫాన్‌ సృష్టించబోతున్నదని కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు. బీజేపీ ఓడిపోతున్నదని, నరేంద్రమోదీ ఈసారి ప్రధాని కాబోవడం లేదని తేల్చి చెప్పారు. ‘ఆ గ్యారెంటీని నేను రాసిస్తాను. మోదీ ఈసారి దేశ ప్రధాని కాబోవడం లేదు. ఆ కథ ముగిసింది’ అని యూపీలోని కన్నౌజ్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో అన్నారు. ఈ స్థానం నుంచి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌తోపాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌సింగ్‌ కూడా ఈ సభలో ప్రసంగించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లకు గాను కాంగ్రెస్‌ 17 స్థానాల్లో పోటీ చేస్తున్నది. గత ఎన్నికల్లో బీజేపీ 62 సీట్లు గెలుచుకోగా, దాని భాగస్వామ్యపక్షం అప్నాదళ్‌ (ఎస్‌)కు 2 సీట్లు లభించాయి.
తన భారత్‌ జోడో యాత్ర, భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర, ప్రతిపక్షాల సమావేశాలను ప్రస్తావించిన రాహుల్‌.. గత ఏడాదికాలంగా ఇండియా కూటమి ఎన్నికల సన్నాహాల్లో ఉన్నదని చెప్పారు. విద్వేష బజారులో తాను ప్రేమ దుకాణాన్ని తెరిచానని అన్నారు.

వ్యాపార వేత్తలు అదానీ, అంబానీలతో తనకు రహస్య ఒప్పందం ఉన్నదని మోదీ చేసిన వ్యాఖ్యలను మరోసారి రాహుల్‌ తిప్పికొట్టారు. ‘పదేళ్లుగా మీరు చూశారు. అదానీ, అంబానీ పేర్లను నరేంద్రమోదీ ప్రస్తావించలేదు. కానీ.. తనను కాపాడగలరని భావించిన వ్యక్తుల పేర్లను ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు’ అని రాహుల్ విమర్శించారు. మోదీపై సెటైర్‌ వేస్తూ.. ‘ఇండియా కూటమి నన్ను చుట్టుముట్టింది.. నేను ఓడిపోతున్నాను.. అదానీజీ.. అంబానీజీ నన్ను కాపాడండి” అని మోదీ తన ఇద్దరు స్నేహితులకు మొత్తుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

‘ఏ టెంపోలో ఎలాంటి డబ్బును అదానీజీ పంపుతారో కూడా ఆయనకు (మోదీకి) తెలుసు’ అని విమర్శించారు. టెంపోల విషయంలో ప్రధాని మోదీకి వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కన్నౌజ్‌ ర్యాలీకి తరలి వస్తున్న వాహనాలను ఆపివేస్తున్నారని వచ్చిన వార్తలను ప్రస్తావించిన రాహుల్‌.. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. కన్నౌజ్‌లో అఖిలేశ్‌ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టంచేశారు.

‘మీకు నేను రాసిస్తా. మీరు చూస్తారు.. యూపీలో ఇండియా కూటమి గాలి వీయనున్నది. రాసిపెట్టుకోండి. బీజేపీకి అతిపెద్ద ఓటమి యూపీలోనే ఎదురుకానున్నది’ అని రాహుల్‌ అన్నారు. యూపీలో మార్పు జరుగుతుందనే విషయంలో ప్రజలు ఇప్పటికే అభిప్రాయానికి వచ్చారని చెప్పారు. ‘భారతదేశంలో ఒక మార్పు చోటుచేసుకోనున్నది. ప్రజలు తమ మనస్సులలో ఒక నిర్ణయానికి వచ్చారు’ అని అన్నారు.

ఇప్పటి వరకూ జరిగిన మూడు దశల పోలింగ్‌లో బీజేపీ చాలా తక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నదని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ చెప్పారు. గతంలో సమాజ్‌వాది ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధిలో కన్నౌజ్‌ శిఖరాలను అధిరోహించిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలు ప్రయాణిస్తున్న హైవే సమాజ్‌వాదీ పార్టీ నిర్మించిందేనన్నారు. ఇప్పటి వరకూ స్తంభించిపోయిన అభివృద్ధిని తాము ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తామని అఖిలేశ్‌ తెలిపారు.

ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు, రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ కోటను నాశనం చేయాలని ప్రయత్నించేవారికి ఈ ఎన్నికల్లో డిపాజిట్లను అప్పగిస్తామని హెచ్చరించారు. అఖిలేశ్‌ నివసించిన ఇంటిని, కన్నౌజ్‌లో ఆయన దర్శించే ఆలయాన్ని విద్వేషంతో బీజేపీవాళ్లు తొలగించారని ఆరోపించారు. మే 13న నాలుగో విడుతలో కన్నౌజ్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Exit mobile version