Rashtrapati Bhavan | రాష్ట్రపతి భవన్‌లో రెండు సమావేశాల మందిరాలకు పేర్లు మార్పు.. కొత్త పేర్లివే
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని రెండు ముఖ్యమైన సమావేశ మందిరాలకు పేర్లను మార్చారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లోని రెండు ముఖ్యమైన సమావేశ మందిరాలకు పేర్లను మార్చారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘జాతికి ఒక చిహ్నంగా, దేశ ప్రజల వారసత్వ సంపదగా ఠీవితో రాష్ట్రపతి భవన్ భాసిల్లుతున్నది. దీనిని ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు నిరంతరం కృషి కొనసాగుతూనే ఉన్నది. భారతీయ సాంస్కృతిక విలువలు, లక్షణాలకు అనుగుణంగా రాష్ట్రపతి భవన్ పరిసరాలను తీర్చిద్దే కృషి నిరంతరం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్‌లోని ‘దర్బార్ హాల్’, ‘అశోకా హాల్’ల పేర్లు మార్చినట్టు ప్రకటనలో తెలిపారు.
దేశంలోని పలు సంస్థల పేర్లను కేంద్రంలోని బీజేపీ మార్చుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్ర న్యాయ చట్టాల పేర్లను సైతం భారతీయత ప్రతిబింబించేలా మార్చారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రపతి భవన్‌లోని హాళ్ల పేర్లు మారాయి. దర్బార్ అనే పదం భారతీయ రాజులు, బ్రిటిష్ కాలాన్ని ప్రతిబింబిస్తుందని ప్రకటనలో రాష్ట్రపతి భవన్ తెలిపింది. భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ఔచిత్యాన్ని కోల్పోయిందని పేర్కొన్నది. అందుకే ‘దర్బార్ హాల్’ను గణతంత్ర మండప్, అశోక హాల్ పేరును అశోక్ మండప్‌గా మార్చాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయించినట్టు తెలిపింది.
జాతీయ అవార్డుల ప్రదానం వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు ‘దర్బార్ హాల్’ వేదికగా ఉంటున్నది. ‘దర్బార్’ అనే పదం భారతీయ రాజులు, బ్రిటిష్ కాలంలో కోర్టులు, శాసనసభలకు వాడేవారని, భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తర్వాత ఆ పదానికి ఔచిత్యం లేదని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటన పేర్కొన్నది. గణతంత్ర భావన భారతీయ సమాజంలో పురాతన కాలం నుంచి ఉన్నదని, అందుకే దర్బార్ హాలుకు గణతంత్ర మండప్ అని నామకరణం చేయడం సబబుగా ఉంటుందని తెలిపింది.
అశోక హాల్ హాల్‌ను బాల్‌రూమ్‌గా ఇప్పటి వరకూ వాడుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘అశోక్ హాల్’ వాస్తవానికి ఒక బాల్‌రూమ్. అశోక్ అనే పదం అన్ని శోకాల నుంచి ముక్తి పొందినవారిని లేదా వేదనలు తొలగిపోయినవారిని సూచిస్తుంది. అదే సమయంలో అశోక చక్రవర్తిని ప్రతిబింబించే అశోక.. ఐక్యత, శాంతితో కూడిన సహజీవనానికి చిహ్నంగా నిలుస్తున్నది. భారత గణతంత్ర జాతీయ చిహ్నంగా సారనాథ్‌లోని ‘లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక’ నుంచి స్వీకరించడమైనది. అశోక చెట్టు భారత మత సంప్రదాయాల్లో, కళలు, సంస్కృతిలో లోతైన ప్రభావాన్ని కలిగి ఉన్నది. అశోక్ హాల్‌ను అశోక్ మండప్‌గా మార్చడంతో భాషలో సమరూపతను తెస్తుంది. ఆంగ్లీకరణ మూలాలను తొలగిస్తుంది. అశోక పదంతో ముడిపడి ఉన్న కీలకమైన విలువలను పెంపొందించేందుకు ఉపకరిస్తుంది’ అని రాష్ట్రపతి భవన్ ప్రకటన తెలిపింది.