Bihar SIR | ఓటరు గుర్తింపు పత్రంగా ఆధార్‌నూ చేర్చాలి : ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం
ఆధార్ కార్డును ఓటరు గుర్తింపు పత్రాల్లో 12వదిగా చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Bihar SIR | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగాల్సిన బీహార్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ఓటరును గుర్తించేందుకు 12వ పత్రంగా ఆధార్‌ను చేర్చాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రస్తుతం బీహార్‌లో జరుగుతున్న ప్రత్యేక సవరణ సందర్భంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించే సమయంలో 11 పత్రాలను ఎన్నికల సంఘం సూచించింది. ఆధార్ అనేది పౌరసత్వానికి గుర్తింపు కాదని స్పష్టం చేసిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిష్ జాయ్‌మాల్యా బాగ్చీ ధర్మాసనం.. ఓటరు జాబితాలో పేరు చేర్చడానికి ఓటరు సమర్పించే ఆధార్ కార్డ్ నంబర్ అసలైనదో కాదో తనిఖీ చేయాలని పేర్కొన్నది.
అక్రమ వలసదారులను ఓటరు జాబితాలో చేర్చాలని ఎవరూ కోరుకోరని ధర్మాసనం స్పష్టం చేసింది. నిజమైన భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలని, నకిలీ పత్రాలను చూపి, పౌరులమని చెప్పేవారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సిందేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆధార్‌ను గుర్తింపు పత్రంగా ఆమోదించే సమయంలో నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు కోరింది. ఆధార్ కార్డును అధికారులు ఆమోదించడం లేదన్న అంశంలో తాము జారీ చేసిన షోకాజ్ నోటీసులకు ఎన్నికల సంఘం స్పందనను సుప్రీంకోర్టు కోరింది.
ముసాయిదా ఓటరు జాబితాలోని 7.24 కోట్ల మందిలో 99.6 శాతం మంది ఇప్పటికే అవసరమైన పత్రాలను సమర్పించారని ఎన్నికల కమిషన్ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ రాకేశ్ ద్వివేదీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్ ను చేర్చాలని పిటిషనర్లు చేసిన డిమాండ్ చేయడంలో అర్థం లేదన్నారు. 2016లో అమల్లోకి వచ్చిన ఆధార్ చట్టం, ప్రజాప్రతినిధుల చట్టంలోని నిబంధనలను ప్రస్తావించిన ధర్మాసనం.. ఆధార్ అనేది పౌరసత్వ ధృవీకరణ పత్రం కాదని, కానీ.. గుర్తింపు అంశంలో దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చని స్పష్టం చేసింది.