Shankaracharya Swami | ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయం.. మతంలోకి రాజకీయాలా? తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శంకరాచార్య
ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయాన్ని పోలిన ఆలయ నిర్మాణంపై ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని పోలిన మరొక ఆలయం ఉండరాదని స్పష్టం చేశారు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కేదార్‌నాథ్ ఆలయాన్ని పోలిన ఆలయ నిర్మాణంపై ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని పోలిన మరొక ఆలయం ఉండరాదని స్పష్టం చేశారు. ‘శివపురాణంలో 12 జోత్యిర్లింగాలను పేరు, ప్రాంతంతో సహా ప్రస్తావించారు. కేదార్‌నాథ్ ఆలయం చిరునామా హిమాలయాల్లో ఉంటే.. ఢిల్లీలో ఎలా నిర్మిస్తారు?’ అని అవిముక్తేశ్వరానంద్ ప్రశ్నించారు. ఈ విషయంలో రాజకీయ జోక్యాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. ‘మత ప్రాంతాల్లోకి రాజకీయ నాయకులు ప్రవేశిస్తున్నారు’ అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేదార్‌నాథ్ ఆలయం గర్భగుడి లోపల బంగారు తాపడం చేయించే విషయంలో వచ్చిన అవినీతి ఆరోపణలను కూడా శంకరాచార్య లేవనెత్తారు. ‘కేదార్‌నాథ్‌లో బంగారం విషయంలో కుంభకోణం జరిగింది. ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తరు? అక్కడ కుంభకోణం చేసి, ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్‌ను నిర్మిస్తారా? అంటే అక్కడ కూడా కుంభకోణమా?’ అని ఆయన మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
కేదార్‌నాథ్ ఆలయంలో పాతికేళ్లుగా పనిచేస్తున్న సీనియర్ పూజారి ఒకరు తొలుత ఈ స్కాం గురించి బయటపెట్టారు. ఆలయంలో బంగారు తాపడం పేరుతో 125 కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. బంగారం బదులు వెండి పూత పూస్తున్నారని ఆయన బయటపెట్టారు. అయితే.. ఆలయ కమిటీ మాత్రం ఆయన ఆరోపణలను కొట్టిపారేసింది. ‘కేదార్‌నాథ్‌లో 228 కేజీల బంగారం అజాలేకుండా పోయింది. ఎలాంటి విచారణ ప్రారంభం కాలేదు. దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు వారు ఢిల్లీలో కేదార్‌నాథ్‌ను నిర్మిస్తామని చెబుతున్నారు. అలా జరగడానికి వీల్లేదు’ అని శంకరాచార్య చెప్పారు.
వాయవ్య ఢిల్లీలోని బురారీ సమీపంలోని హిరాంకి ప్రాంతంలో బుధవారం కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు రుద్రప్రయాగ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ పూజారులు ఆలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేదార్ సభ బ్యానర్ కింద వివిధ ఇతర సంస్థలతో కలిసి వారు ఈ నిరసన తెలిపారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఢిల్లీలో ఆలయం నిర్మించడానికి తాము వ్యతిరేకం కాదని, కానీ.. ఒక మతపరమైన ట్రస్టు కేదార్‌నాథ్ ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించడంపైనే తమ అభ్యంతరమని కేదార్ సభ ప్రతినిధి పంకజ్ శుక్లా చెప్పారు. ఈ నిర్మాణం కోసం కేదార్‌నాథ్ క్షేత్రం నుంచి ఒక రాయిని కూడా తరలించారని ఆయన తెలిపారు. అది రుద్రప్రయాగ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ పవిత్రను తగ్గించడమేనని అన్నారు. రుద్రప్రయాగ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని పోలిన ఆలయాన్నే అదే పేరుతో ఢిల్లీలో నిర్మించడం ఉత్తరాఖండ్‌లోని పుణ్యక్షేత్ర మతపరమైన పవిత్రతను తగ్గించేందుకు, భక్తులను దోచుకునేందుకు జరుగుతున్న కుట్ర అని మరో నిరసనకారుడు ప్రదీప్ శుక్లా విమర్శించారు.
ఇదే ధోరణి కొనసాగితే కశ్మీర్‌లోని బాబా అమర్‌నాథ్ ఆలయాన్ని పోలిన ఆలయాన్ని కూడా ప్రకృతి వైపరీత్యాలు, భద్రత పేరుతో ఢిల్లీలో నిర్మించే ప్రమాదం లేకపోలేదని అన్నారు. అది సనాతన ధర్మానికి దురదృష్టకర రోజు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్మించే కేదార్‌నాథ్ ధామ్ వద్ద చరణ అమృత్ (పవిత్ర జలం) పంపిణీ చేయడంపైనా కేదార్‌సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అది మతపరమైన మార్గదర్శకాల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.
అయితే.. ఈ ప్రాజెక్టును ఢిల్లీలోని కేదార్‌నాథ్ ధామ్ ట్రస్ట్ అధ్యక్షుడు సురీందర్ రౌతేలా సమర్థించుకున్నారు. ‘ఢిల్లీలో ఆలయాన్ని శ్రీకేదార్‌నాథ్ ధామ్ ట్రస్ట్, ఢిల్లీ నిర్మిస్తున్నదని, దీనితో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఎలాంటి సబంధం లేదని చెప్పారు. ఇప్పటికే ఇండోర్‌లో కేదార్‌నాథ్ ఆలయం నిర్మించారని, ముంబైలో బ్రదీనాథ్ ఆలయం కట్టారని అన్నారు. వటిని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ ప్రారంభించారని గుర్తు చేశారు. కేదార్‌నాథ్ అనేది హిందువులకు అత్యంత పవిత్ర ప్రాంతాల్లో ఒకటి. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రితో కలిపి చార్‌ధామ్‌లో భాగంగా విలసిల్లుతున్నది. మే నుంచి అక్టోబర్ నెలల మద్య లక్షల మంది భక్తులు ఈ ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు.