Leopard Attack | ఆరు బయట చదువుకుంటున్న ఆరేళ్ల పిల్లాడిని చంపిన చిరుత పులి
Leopard Attack | ఆరు బయట చదువుకుంటున్న ఓ ఆరేళ్ల పిల్లాడిపై చిరుత పులి దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటన పుణె జిల్లాలోని జున్నార్ తాలుకా పరిధిలో చోటు చేసుకుంది.

Leopard Attack | ముంబై : ఆరు బయట చదువుకుంటున్న ఓ ఆరేళ్ల పిల్లాడిపై చిరుత పులి దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటన పుణె జిల్లాలోని జున్నార్ తాలుకా పరిధిలో చోటు చేసుకుంది.
జున్నార్ తాలుకా పరిధిలోని కుమ్‌షేత్ గ్రామానికి చెందిన సిద్ధార్థ్ పర్వీన్ కేడ్కర్ ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో తన ఇంటి బయట కూర్చోని చదువుకుంటున్నాడు. అంతలోనే ఓ చిరుత పులి ఆ పిల్లాడిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది.
అయితే బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల నివాసాలతో పాటు బంధువుల నివాసాల్లో వెతికారు. కానీ బాలుడి ఆచూకీ లభించలేదు. తమ ఇంటికి 100 మీటర్ల దూరంలో బాలుడి మృతదేహం కనిపించింది. కుమారుడి డెడ్‌బాడీని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ గ్రామంలో కేవలం 10 నుంచి 15 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి.
ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులు నిఘా పెంచారు. పిల్లలను బయటకు పంపొద్దని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.