బీజేపీ వాషింగ్ మిషన్ నేతలు.. కమలం సుద్ధపూసలు హిమంత, సువేందు

అసోం రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి, రెండోసారి ఆ పదవిని అధిష్ఠించేందుకు సిద్ధంగా ఉన్న హిమంత బిశ్వ శర్మ పశ్చిమ భారతదేశాన్ని కుదిపేసిన శారదా గ్రూపు కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడిగా వెలుగొందారు కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన స్కూల్ టీచర్ల నియామక స్కామ్‌లో బీజేపీఎల్పీ నేత సువేందు అధికారి ప్రముఖ పాత్ర పోషించారు. దీంతోపాటు ఆయన శారదా గ్రూపు కుంభకోణంలో ఇరుక్కున్నారు.

  • By: TAAZ |    national |    Published on : May 06, 2026 8:31 PM IST
బీజేపీ వాషింగ్ మిషన్ నేతలు.. కమలం సుద్ధపూసలు హిమంత, సువేందు
  • శారదా స్కామ్‌లో హిమంత శర్మ
  • స్కూల్ టీచర్ స్కామ్లో సువేందు
  • ఇద్దరివీ కాంగ్రెస్ వారసత్వాలే..

అసోం రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి, రెండోసారి ఆ పదవిని అధిష్ఠించేందుకు సిద్ధంగా ఉన్న హిమంత బిశ్వ శర్మ పశ్చిమ భారతదేశాన్ని కుదిపేసిన శారదా గ్రూపు కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడిగా వెలుగొందారు కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన స్కూల్ టీచర్ల నియామక స్కామ్‌లో బీజేపీఎల్పీ నేత సువేందు అధికారి ప్రముఖ పాత్ర పోషించారు. దీంతోపాటు ఆయన శారదా గ్రూపు కుంభకోణంలో ఇరుక్కున్నారు.

ఈ స్కామ్ జరిగిన సమయంలో ఆయన టీఎంసీ పార్టీలో ముఖ్య నాయకుడిగా, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఈ ఇద్దరు నాయకులు బీజేపీ అగ్రనేతల బెదిరింపుల మూలంగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. బీజేపీలో చేరడంతో వారంతా పునీతులు, సత్యపూసలు అయ్యారా? అనే విమర్శలు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. ఇద్దరు నాయకులు కాంగ్రెస్ కుటుంబాల నుంచి రాజకీయంగా ఎదిగి, ఇప్పుడు ఆ పార్టీని కూకటి వెళ్లతో పెకిలించి వేస్తామని వేదికల మీద సవాళ్లు విసురుతుండడం రాజకీయ పరాకాష్టగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇద్దరిని గొప్ప నేతలుగా కాషాయ నాయకులు ప్రచారం చేస్తుండడం శోచనీయమని అంటున్నారు.

డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఆల్ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌లో విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1996 సంవత్సరంలో అప్పటి సీఎం హితేశ్వర్ సైకియా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. 2001 సంవత్సరంలో జలుక్‌బరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన హిమంత బిశ్వ శర్మ ఆగస్టు 2015 సంవత్సరంలో 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయారు. 2002 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్‌తో తో రాజకీయ విభేదాలు రావడం, శారదా గ్రూపు స్కామ్‌లో ఉండటంతో 2014లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.

2016 నుంచి 2021 వరకు సర్పానంద సోనోవాల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2021లో తొలిసారి హిమంత శర్మ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం, 2017లో మణిపూర్‌లో కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మేఘాలయ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటులో ప్రముఖంగా వ్యవహరించారు. నాగాలాండ్ లో నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీలతో కలిసి బీజేపీతో కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ పెద్దల వద్ద గుర్తింపు పొందారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 మంది సభ్యులకు గాను బీజేపీ కూటమి 102 సీట్లను కైవసం చేసుకున్నది. దీంతో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2013 సంవత్సరంలో శారదా గ్రూపు ఆర్థిక కుంభకోణం ఈశాన్య రాష్ట్రాలను కుదిపేసింది. శారదా గ్రూపులో సుమారు రెండు వందల కంటే ఎక్కువగా ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. ఈ గ్రూపు కుప్పకూలడానికి ముందు 17 లక్షల మందికి పైగా డిపాజిటర్ల నుంచి రూ.30వేల కోట్ల డిపాజిట్లు సేకరించింది. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం వేలాది మంది ఏజెంట్లు, డిపాజిట్ దారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యంగా బెంగాల్ లో నిత్యం ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆఫీసుల ముట్టడి వంటి ఘటనలు జరిగాయి.

ఈ గ్రూపు అక్రమాలపై అప్పటి సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. వేలాది కుటుంబాలతో ముడిపడి ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఐటీ తో పాటు ఈడీ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ కుంభకోణంలో రాజకీయ నాయకులు ఉండడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. టీఎంసీ ఎంపీ కునాల్ ఘోష్ ఈ సంస్థలో ఉద్యోగిగా ప్రతి నెలా 17వేల యూఎస్ డాలర్ల వేతనం తీసుకున్నారు. ఈ కేసులో హిమంత బిశ్వ శర్మ ను 2014 సంవత్సరంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారించింది. ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. శారదా గ్రూప్ అధినేత సుదీప్త సేన్ నుంచి హిమంత పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు పొందారని టీఎంసీ నేతలు అప్పట్లో ఆరోపణలు చేశారు. ఆ తరువాత ఆయన కేసు గండం నుంచి బయటపడేందుకు, జైలు జీవితం తప్పించుకునేందుకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని బెంగాల్ నాయకులు ఇప్పటికీ విమర్శిస్తుంటారు.

బీజేపీలో చేరిన తరువాత ఆయనకు క్లీన్ చిట్ లభించిందని, కేవలం సాక్షిగానే పిలిచామని సీబీఐ కూడా ప్రకటించడం గమనార్హం. ఆయన పార్టీ మారిన తరువాత ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పురోగతి లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 2020 డిసెంబర్ నెలలో శారదా గ్రూపు డైరెక్టర్ సుదీప్త సేన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అప్పటి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఒక లేఖ రాశారు. శారదా గ్రూపు నుంచి ప్రస్తుత బెంగాల్ సీఎం రేసులో ఉన్న సువేందు అధికారి, సీపీఎం నాయకులు సుజన్ చక్రవర్తి, బిమన్ బోస్ వంటి నాయకులు పెద్ద ఎత్తున లబ్ధి పొందారని వివరాలతో సహా లేఖలో తెలిపారు. సుదీప్త సేన్ పరారీకి ఒక రోజు ముందు సువేందు అధికారి చిట్ ఫండ్ కార్యాలయం వెళ్లి రూ.6 కోట్లు వసూలు చేశారని, ఆ తరువాత బ్లాక్ మెయిల్‌కు దిగారని, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ అప్పట్లో లేఖను బహిరంగ పర్చారు. మనీ ల్యాండరింగ్ ఉన్నందున సువేంధు అధికారిని అరెస్టు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు టీఎంసీ ఎంపీ కునాల్ ఘోష్ లేఖ కూడా రాశారు.

పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు పోటీపడుతున్న సువేందు అధికారి కూడా తక్కువ అసామీ ఏమీ కాదు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అవలక్షణాలు అన్నీ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ 2014లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఈయనతో పాటు సోదరుడు దిబ్యేందు అధికార పేరు మారు మోగింది. బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలోని 32వేల మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టింది. మాజీ ఎంపీ అయిన దిబ్యేంధు తో పాటు సువేంధు లు నియామకాల కోసం పలువురి పేర్లను సిఫారసు చేసినట్లు సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేసింది కూడా. ఈ నియామకాలు చెల్లవని కొలకత్తా హైకోర్టు సింగిల్ బెంచి తొలుత తీర్పునివ్వగా, దీనిపై మమతా బెనర్జీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. నియామకాలు చెల్లుతాయని 2025 సంవత్సరంలో డివిజన్ బెంచి తీర్పునివ్వడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. సుమారు దశాబ్ధకాలం పాటు వీరు తీవ్ర మనో వేదనను అనుభవించారు. శారదా గ్రూపుతో పాటు ఉపాధ్యాయ నియామక కేసుల గండం నుంచి బయటపడేందుకు సువేంధు అధికారి 2020 సంవత్సరం డిసెంబర్ నెలలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారనేది జగమెరిగిన సత్యం. 2021 నుంచి 2026 వరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ పక్షం నేతగా పనిచేశారు.

ఈయన నేపథ్యం ఒకసారి చూస్తే 1995 సంవత్సరంలో కాంగ్రెస్ తరఫున కాంధీ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన తండ్రి శిశిర్ అధికారి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 లో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ వీడి టీఎంసీ పార్టీ స్థాపిండంతో సువేంధు చేరిపోయారు. 2006 లో తొలిసారి కాంధీ దక్షిణ్ సీటు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నందిగ్రామ్ లో సెజ్ కు వ్యతిరేకంగా చేసిన పోరాటం ఆయన రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పింది. మమతా బెనర్జీ సర్కార్ లో పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. మమతా బెనర్జీ బలాలు, బలహీనతలు తెలిసిన నాయకుడు కావడంతో బీజేపీ అగ్రనేతలు లొంగదీసుకుని సువేంధును చేర్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. పార్టీలో చేరితే సరి లేదంటే శారదా గ్రూపు, ఉపాధ్యాయ నియామక కేసుల్లో లేవకుండా ఇరికిస్తామని బెదిరింపులకు దిగడంతో కాషాయ తీర్థం పుచ్చుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో సీఎం పదవికి ప్రధాన పోటీదారుడిగా ముందంజలో ఉండడం విశేషం.