టీఎంసీని గట్టిదెబ్బ కొట్టిన ముస్లిం ఓటర్లు!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమిలో ముస్లిం ఓట్లు సైతం కీలక పాత్ర పోషించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సర్ ఎఫెక్ట్, కేంద్ర ప్రభుత్వం అష్టదిగ్బంధం, కేంద్ర సంస్థల వాడకంతోపాటు.. మమతా బెనర్జీ ఓటమి వెనుక ముస్లిం ఓటర్ల ప్రభావం కూడా గణనీయంగా ఉన్నదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో ముస్లింల జనాభా దాదాపు 30 శాతం ఉంటుంది. వారిలో సింహభాగం ఓటర్లు తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేశారని సమాచారం. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్, సీపీఎం–ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్‌ఎఫ్), ఆమ్ జనతా ఉన్నాయన్ పార్టీ (ఏజేయూపీ), ఎంఐఎం వంటి పార్టీలకు మళ్లాయి. కొంత భాగం ముస్లిం ఓటింగ్ సైతం బీజేపీకి మళ్లినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీ పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఇదొక నిదర్శనంగా భావిస్తున్నారు.
‘తృణమూల్ కాంగ్రెస్ ఓటింగ్‌లో ఏడు నుంచి ఎనిమిది శాతం ఓట్లు వేరే పార్టీలకు పోలయ్యాయి. కొన్ని ఏరియాల్లో బీజేపీకి కూడా పడ్డాయి’ అని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జాద్ మహమూద్ అభిప్రాయాపడ్డారని ది వీక్ కథనం పేర్కొంటున్నది. అందుకే సీపీఎం దోమకల్ స్థానాన్ని గెల్చుకుందని, ఫర్రాకా, రాణినగర్‌లో కాంగ్రెస్ గెలుపొందగలిగిందని ఆయన వివరించారు. ఇవి ముర్షీదాబాద్ జిల్లాలోనివే కావడం గమనార్హం. స్వాతంత్ర్యం తర్వాత ముస్లింలు భిన్నంగా ఓటు వేసిన సందర్భం ఇదేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు అదొక పెద్ద దెబ్బగా అభివర్ణిస్తున్నారు. ‘మైనార్టీల ప్రభావం అధికంగా ఉన్న ఈస్ట్ మిడ్నాపూర్, ఈస్ట్ బర్ధమాన్ జిల్లాలో అనేక మంది బీజేపీకి ఓటేశారు. తమకు ముస్లిం ఓట్లు అక్కర్లేదని, తాము హిందూ ఓట్లనే నమ్ముకున్నామని బీజేపీ నేత సువేందు అధికారి చెప్పినప్పటికీ.. మైనార్టీల ఓటింగ్ ప్యాట్రన్ కూడా బీజేపీకి సానుకూలంగా మారింది’ అని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఉత్తర 24 పరగణాల్లో 33 సీట్లు ఉన్నాయి. అందులో బీజేపీకి 24 సీట్లు లభించాయి. వాస్తవానికి 2021లో బీజేపీ ఇక్కడ ఐదు సీట్లను మాత్రమే గెలుచుకున్నది. దక్షిణ 24 పరగణాల్లో 31 సీట్లు ఉంటే.. 2021లో ఒక్క సీటు కూడా గెలువలేక పోయిన బీజేపీ.. ఈసారి ఏకంగా పది సీట్లను కైవసం చేసుకున్నది.
ఉత్తర, మధ్య బెంగాల్ ప్రాంతాల్లో మైనార్టీలు అధికంగా ఉండే జిల్లాలు ఉన్నాయి. మాల్డాలో 12 సీట్లకు గాను బీజేపీ 2021లో 2 సీట్లను గెలుపొందగా.. ఈసారి ఆరు చోట్ల విజయం సాధించింది. ముర్షీదాబాద్‌లో 22 సీట్లకు గాను 2021లో బీజేపీ రెండు సీట్లు గెలిస్తే.. ఈసారి 8 చోట్ల గెలిచింది. ఉత్తర దినాజ్‌పూర్‌లో గతంలో రెండు గెలిచిన బీజేపీ ఈసారి 9 సీట్లలో నాలిగింటిని కైవసం చేసుకున్నది. ఈ మూడు జిల్లాల్లోని 43 సీట్లలో 2021లో టీఎంసీ 35 గెలుచుకున్నది.
ఈ ఎన్నికల్లో బీజేపీ 45.5 శాతం ఓట్లు తెచ్చుకుంటే.. టీఎంసీకి 40.8 శాతం ఓట్లు లభించాయి. అంటే.. బీజేపీ, టీఎంసీ మధ్య ఓట్లలో ఐదు శాతం తేడా ఉంది. మైనార్టీ ఓట్లలో చీలిక, టీఎంసీకి వ్యతిరేకంగా హిందూ ఓట్ల పోలరైజేషన్ కారణంగానే ఈ తేడా వచ్చిందని ప్రొఫెసర్ మహమూద్ అన్నారు. 2021లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ సమయంలో టీఎంసీకి 48.5 శాతం ఓట్లు లభిస్తే.. బీజేపీకి 38.4 శాతం ఓట్లు వచ్చాయి. అంటే.. బీజేపీ 7.1 శాతం ఓట్లను పెంచుకుంటే.. టీఎంసీ 7.7 శాతం ఓట్లు నష్టపోయింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram