అధ్యక్షుడు నితిన్ నబీన్ సారధ్యంలోని బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఏపీకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరీ సహా మాజీ సీఎం వసుంధర రాజే, రామ్ మాధవ్‌తో పాటు 13 మందికి ఉపాధ్యక్ష పదవులు దక్కాయి. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తిరత్ సింగ్ రావత్, బైజయంత్ జే పాండా, రేఖా వర్మ, వర్షబెన్ నరేంద్రభాయ్ దోషి, భారతీ ప్రవీణ్ పవార్, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, ఎం నాగరాజా, తారిఖ్ మన్సూర్, మధుచంద్ర కర్ లు ఉపాధ్యక్షులుగా నియామితులయ్యారు.
బీజేపీ ఎనిమిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులను నియమించింది. ఈ జాబితాలో స్మృతి ఇరానీతో సహా వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లబ్ కుమార్ దేబ్, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా ఉన్నారు. పార్టీ జాయింట్ కోఆర్డినేటర్‌గా ఏపీకి చెందిన విష్ణువర్ధన్‌రెడ్డిని నియమించారు. జాతీయ కార్యదర్శులుగా 16 మందికి చోటుకల్పించారు. కేంద్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా తరుణ్ చుగ్, సెంట్రల్ ఆఫీస్ కార్యదర్శిగా ఉత్తరాఖండ్‌కు చెందిన మహేంద్ర పాండే నియమితులయ్యారు. ఓబీసీ మోర్చా నూతన అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్య పేర్లను ప్రకటించారు.
సంస్థాగత జనరల్ సెక్రటరీగా మరోసారి బీఎల్..సంతోష్ నియామితులవ్వగా, సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీలుగా శివప్రకాష్, సౌదాన్ సింగ్‌లు పేర్లను ఖరారు చేశారు. పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. రాజేష్ మంగళ్ జాతీయ సంయుక్త కోశాధికారిగా నియమితులయ్యారు. పార్టీ తన సంస్థాగత, ప్రచార విభాగాలలో కూడా నియామకాలను ప్రకటించింది. సంబిత్ పాత్రా ఈశాన్య ప్రాంత కోఆర్డినేటర్‌గా నియమితులయ్యారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే పార్లమెంటరీ బోర్డు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, మార్గదర్శక మండలి వంటి కీలక సంస్థల్లో కూడా మార్పులు, కొత్త నియామకాలు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల కథనం.
కొత్త జట్టులో తెలంగాణకు దక్కని ప్రాతినిధ్యం
బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కకపోవడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను సైతం ఆ పదవి నుంచి తప్పించారు. తెలంగాణ బీజేపీ నాయకత్వంలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండటం, రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో పార్టీ పుంజుకోలేకపోతుండటంతో పాటు త్వరలో జరుగబోయే మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు ఇచ్చే ఉద్దేశంతో రాష్ట్ర నాయకులకు జాతీయ కార్యవర్గానికి దూరం పెట్టారన్న ప్రచారం వినిపిస్తుంది.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin द्वारा निम्नलिखित सदस्यों को भाजपा के राष्ट्रीय पदाधिकारी एवं अन्य दायित्वों पर नियुक्त किया जा रहा है। (1/2) pic.twitter.com/tcTJsJG0dc
— BJP (@BJP4India) August 17, 2026
