BJP Telangana State President: జులై 1న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక

విధాత, హైదరాబాద్ : కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖారారైంది. జులై 1న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్ల స్వీకరణ, జులై 1న రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. అదే సమయంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం కూడా జరుగనుంది. తెలంగాణ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శోభ కరండ్లాంజెను నియమించగా, ఏపీ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పీసీ మోహన్‌ను నియమించారు.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పీఠంపై కన్నేసిన బీజేపీ పార్టీ నుంచి బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. డిసెంబర్-జనవరిలో జరుగాల్సిన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఆశావహుల మధ్య నెలకొన్న పోటీ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కొనసాగించారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్ లు ఉన్నారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్థానంలో వచ్చే కొత్త అధ్యక్షుడి సారధ్యంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ ఎదుర్కోవాల్సి ఉంది.