విధాత : దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘నీట్’ (NEET) పరీక్షల పేపర్ లీకేజీలను, ఢిల్లీలో నిరసలకు దిగిన విద్యార్ధులపై లాఠాచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ..కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ విద్యార్ధి సంఘాల ఐక్య వేదిక జూలై 24వ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. బుధవారం హైదరాబాద్‌లో విద్యార్థి సంఘాల ఐక్యవేదిక (SFI, AISF, NSUI, PDSU, AIFDS, AISB, AIPSU) నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బంద్ వివరాలను వెల్లడించారు.
పరీక్షల నిర్వహణలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయాలని, విద్యా వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగం కలిగించే వీబీఎస్ఏ బిల్లును వెనక్కి తీసుకోవాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల దమకకాండపై విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 24న జరిగే బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు, తల్లిదండ్రులు, మేధావులు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ), కె.మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ (ఏఐఎస్ఎఫ్), వెంకట్ స్వామి (ఎన్ఎస్ యూఐ), పల్లె మురళి (ఏఐఎఫ్ డిఎస్), అశోక్ రెడ్డి, అనిల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
