ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య మరింత ముదరనున్న వార్‌ … గురువారానికి వాయిదా పడిన సభ

18వ లోక్‌సభ సమావేశాలు ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య వాద ప్రతివాదాలు..చర్చల రచ్చలు..వాకౌట్‌లు..బహిష్కరణలకు వేదిక కానున్నాయనడానికి బుధవారం మూడో రోజు సాగిన సమావేశాల తీరు సంకేతంగా నిలిచాయి

ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య మరింత ముదరనున్న వార్‌ … గురువారానికి వాయిదా పడిన సభ

సభా సమరానికి ట్రైలర్‌గా ఎమర్జన్సీ రచ్చ

విధాత, హైదరాబాద్‌ : 18వ లోక్‌సభ సమావేశాలు ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య వాద ప్రతివాదాలు..చర్చల రచ్చలు..వాకౌట్‌లు..బహిష్కరణలకు వేదిక కానున్నాయనడానికి బుధవారం మూడో రోజు సాగిన సమావేశాల తీరు సంకేతంగా నిలిచాయి. ఎమర్జన్సీపై ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య సాగిన రచ్చ మునుముందు లోక్‌సభ సమావేశాలకు ట్రైలర్‌గా కనిపించింది. లోక్‌సభ తొలి రెండు రోజులు సభ్యుల ప్రమాణ స్వీకారంతో సాగిపోగా, మూడవ రోజు స్పీకర్ పదవి ఎన్నిక కోసం ఎన్డీఏ, ఇండియా కూటమిలు తొలిపోరులో తలపడగా, ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు. ప్రధాని మోదీ ఓం బిర్లా రెండోసారి స్పీకర్‌గా ఎన్నికవ్వడం పట్ల అభినందనలు తెలిపారు. తర్వాతా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు కూడా స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ సభలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని సూచించారు. సభా నిర్వహణలో తాము పూర్తిగా సహకరిస్తామని విపక్షం తరపున రాహుల్ గాంధీ స్పీకర్‌కు హామీ ఇచ్చారు. విపక్షం మాట్లాడేందుకు అనుమతించడంతో పాటు భారత ప్రజల పక్షాన తమ ప్రాతినిధ్యాన్ని అనుమతిస్తారనే విశ్వాసం తమకుందని చెప్పారు.

ఎమర్జన్సీ బ్లాక్ డే

చివరగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. 1975 నాటి ఎమర్జెన్సీ నిర్ణయాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందని, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడిన వారందరినీ సభ అభినందిస్తోందన్నారు. భారతదేశ చరిత్రలో 1975 జూన్ 25వ తేదీ బ్లాక్‌డేగా నిలిచిపోతుందని, ఆరోజు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి, బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంపై దాడి చేశారని ఓం బిర్లా లోక్‌సభలో చేసిన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కి, భావ ప్రకటనా స్వేచ్ఛ గొంతు నులిమారని అన్నారు. ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిదనే విషయం యావత్ ప్రపంచానికి తెలుసునని, ప్రజాస్వామ్య విలువలు, దానిపై చర్చకు ఇండియా ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందన్నారు. వాటి పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మృత్యర్థం రెండు నిమిషాల మౌనాన్ని ఆయన పాటించారు. ఇందుకు ప్రతిగా కొత్త లోక్‌సభలో ఎమర్జెన్సీ ప్రస్తావనపై విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేస్తూ, నినాదాలు చేశారు. స్పీకర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. విపక్ష సభ్యుల వైఖరిపై ఎన్డీఏ సభ్యులు మండిపడగా, ఇరు పక్షాల వాదోపవాదాలు, నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు. అనంతరం పార్లమెంటు బయట ఎమర్జన్సీ రోజులకు వ్యతిరేకంగా ఎన్డీయే నిరసనలు చేపట్టగా, ఇండియా కూటమి సభ్యులు పోటీగా నినాదాలు చేశారు. ఎన్డీఏ నిరసనలో పాల్గొన్న ఎంపీ కంగనారౌనత్ మాట్లాడుతూ తాతలు, తండ్రుల పేరుతో ఓట్లడిగే నేతలు తమ పూర్వీకులు చేసిన తప్పులకు బాధ్యత తీసుకోవాలని ఎమర్జన్సీని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలపై విమర్శలు గుప్పించారు. గతంలో తమ తాతలు, తండ్రుల హయాంలో ప్రజాస్వామ్యానికి ఎలా తూట్లు పొడిచేరా స్వయంగా తమ ట్రాక్‌ రికార్డ్‌ను గురించి పరిశీలించుకోవాలని ఆమె హితవు పలికారు.