Shankaracharya Swami | విశ్వాస ఘాతుకానికి బలైన ఉద్ధవ్ ఠాక్రె … శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ వ్యాఖ్యలు
శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రె విశ్వాస ఘాతుకానికి బలయ్యారని జోత్యిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ వ్యాఖ్యానించారు. ఠాక్రేను ముంబైలోని ఆయన నివాసం మాతోశ్రీలో అవిముక్తేశ్వరానంద్ ఆదివారం కలుసుకున్నారు

విశ్వాస ఘాతుకానికి బలైన ఉద్ధవ్ ఠాక్రె
ఆయన మళ్లీ సీఎం అయితేనే ఆ బాధ పోతుంది
శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ వ్యాఖ్యలు
శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రె విశ్వాస ఘాతుకానికి బలయ్యారని జోత్యిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ వ్యాఖ్యానించారు. ఠాక్రేను ముంబైలోని ఆయన నివాసం మాతోశ్రీలో అవిముక్తేశ్వరానంద్ ఆదివారం కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన శంకరాచార్య.. ఠాక్రేకు తన సంఘీభావం ప్రకటించారు. ‘మనమంతా సనాతన ధర్మాన్ని పాటించేవాళ్లం. పాపం, పుణ్యం అనేందుకు నిర్వచనాలు ఉన్నాయి. విశ్వాసఘాతుకం అనేది అతిపెద్ద పాపం. అది ఉద్ధవ్ ఠాక్రె విషయంలో జరిగింది’ అని అవిముక్తేశ్వరానంద్ అన్నారు. ‘ఆయన ఎదుర్కొన్నదానికి మేం ఎంతో బాధపడ్డామని ఠాక్రేకు చెప్పాను. ఆయన మళ్లీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే మా బాధ తొలగిపోతుంది’ అని చెప్పారు. శివసేనను చీల్చిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి 2022 జూన్‌లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన సంగతి తెలిసిందే. న్యాయ పోరాటంలో షిండే గ్రూపును అసలైన శివసేనగా సుప్రీంకోర్టు గుర్తించింది.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చినవారిపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన అవిముక్తేశ్వరానంద్.. ‘మోసం చేసేవాడు హిందువు కాలేడు. ఆ మోసాన్ని భరించగలిగినవాడే హిందువు’ అని అన్నారు. ‘జరిగిన విశ్వాసఘాతుకానికి యావత్ మహారాష్ట్ర ఆవేదన చెందింది. అది ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిఫలించింది’ అని చెప్పారు. ‘మాకు రాజకీయాలతో సంబంధం లేదు. హిందూ మతం ప్రకారం పాపమైన విశ్వాస ఘాతుకం గురించే మేం మాట్లాడుతున్నాం’ అని తెలిపారు. మాతోశ్రీలో ఉద్ధవ్ కుటుంబం నిర్వహించిన పూజల్లో ఆయన పాల్గొన్నారు. అయోధ్యలో రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని స్వామి అవిముక్తేశ్వరానంద్ తిరస్కరించిన విషయం తెలిసిందే.