Uttarakhand | ఉత్తరాఖండ్ లో ప్రకృతి భీభత్సం..50మంది గల్లంతు
ఉత్తరాఖండ్‌లో విరుచుకుపడ్డ క్లౌడ్‌బర్స్ట్ కారణంగా ధరాలీ గ్రామం పూర్తిగా మునిగిపోయింది. 50 మందికిపైగా గల్లంతు, నలుగురు మృతి. SDRF, NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రకృతి భీభత్సం పూర్తి వివరాలు తెలుసుకోండి.

భారీ వరదలు..విరిగిపడ్డ కొండచరియలు.. కొట్టుకపోయిన ధరాలీ గ్రామం
Uttarakhand | విధాత : ప్రకృతి కన్నెర్రతో మరోసారి ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రం విలవిలలాడింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో(UttarKashi) క్లౌడ్ బరస్ట్(Cloudburst) కారణంగా సంభవించిన మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. ఇక్కడి ధరాలీ(Dharali) గ్రామంపై జలప్రవాహం విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు సమాచారం. దాదాపు 50 మందికి పైగా గల్లంతయ్యారు. పలు హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సునామీ జల ప్రళయాలను తలపించేలా ఆకాశం చిల్లులు పడినట్లుగా భారీ వర్షాలు ఉత్తర కాశీ ప్రాంతాన్ని ముంచెత్తాయి. భారీ వరదల నీరు, అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున బురద వరదగా సాగి ధరాలి గ్రామాన్ని కప్పేసింది. దీంతో ఇప్పుడు ఆ ప్రదేశం మరు భూమిని తలపిస్తోంది. కుంభవృష్టి కారణంగా ఎగువ ప్రాంతమైన ఖీర్‌గఢ్ నదీ పరివాహక ప్రదేశం నుంచి మెరుపు వరదలు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్‌డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ బృందాలు ఘటనా స్థలానికి బయల్దేరి రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఆహ్లాదకరమైన ప్రకృతితో కనువిందుగా కనిపించే ధరాలీ గ్రామానికి చార్‌ధామ్ యాత్రికులు ఎక్కువగా సందర్శిస్తుంటారు. గంగోత్రి ధామ్ కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామం మధ్య నుంచి జాతీయ రహదారి వెళుతుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో లాడ్జిలు, అతిథి గృహాలున్నాయి. ప్రస్తుతం అవన్ని కూడా తమ నామరూపాలు కోల్పోయాయని తెలుస్తుంది. ధరాలీ సమీపంలోని హార్సిల్ లోయలో భారీ విస్తీర్ణంలో ఉండే యాపిల్ తోటలు కూడా వరద భీభత్సంలో దెబ్బతిన్నాయి. ఆగస్టు 10వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ ధరాలీ గ్రామం విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. ధరాలీ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. బాధిత కుటుంబాలకుమోదీ సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి పుష్కర్ ధామీతో మాట్లాడి వివరాలు తెలుసుకుని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీఎం ధామీకి ఫోన్ చేసి స్థానిక పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్రం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.