అధిక వడ్డీలు..రాబడులు ఇస్తామని వాగ్ధానాలు చేసి, పోంజీ స్కీమ్‌లు, ఫారెక్స్ ట్రేడింగ్‌లోకి ప్రజలను ప్రలోభపెట్టి, వివిధ బూటకపు సంస్థలు, ఎంటిటీల బ్యాంకు ఖాతాలలో రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి జనం నెత్తిన కుచ్చుటోపి పెట్టిన పూణే వ్యాపారవేత్త వినోద్ ఖుటేపై ఈడీ, సైబర్ క్రైమ్ కేసులు నత్తనడకన సాగుతుండటంపై బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. పాంజీ, అక్రమ ఫారెక్స్ ట్రేడింగ్ రాకెట్‌కు సంబంధించిన రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో పూణే వ్యాపారవేత్త వినోద్ ఖుటేతో పాటు మరో ఎనిమిది మందికి ముంబై పీఎంఎల్‌ఏ కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే ఈ కేసులో నిందితుల అరెస్టు లేకపోవడం..దోచుకున్న సొమ్ము రికవరీ చర్యలలో జాప్యం బాధిత కుటుంబాలను కలవర పెడుతుంది. విప్స్ గ్రూప్ మోసాలపై ఈడీ మహారాష్ట్ర వరకే దర్యాప్తు పరిమితం చేసినా..దేశ వ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా ప్రజల నుంచి డిపాజిట్ల సేకరణ చేసి షెల్ ఖాతాలకు మళ్లించినట్లుగా విప్స్ గ్రూప్ పై అభియోగాలు ఉన్నాయి.
ఆరేళ్లుగా నానుతున్న కేసులు…
VIPS వాలెట్ ప్రైవేట్ లిమిటెడ్, VIPS ట్రేడ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల డైరెక్టర్ అయిన ఖుటే, 2020 నుండి పెట్టుబడిదారులకు నెలవారీ 2-3% రాబడులు, కొత్త సభ్యులను చేర్చుకున్నందుకు కమీషన్లు ఇస్తామని వాగ్దానం చేసి వారి నుండి డబ్బు వసూలు చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అభియోగాలు మోపింది. ఈడీ ప్రకారం, నిందితులు ఆన్‌లైన్ ప్రజెంటేషన్లు వర్చువల్ ప్రచారాలతో పెద్ద ఎత్తున ఏజెంట్ల ద్వారా నిధుల సమీకరణ చేశారు. కొంతకాలం లావాదేవీలు నిర్వహించి అకస్మాత్తుగా ప్లాట్‌ఫారమ్స్ మూసివేసి పెట్టుబడిదారులను మోసం చేశారని ఈడీ పేర్కొంది. హవాలా మార్గాల ద్వారా నిధులను విదేశాలకు తరలించి, వ్యక్తిగత సంపద కోసం ఉపయోగించుకున్నారని ఏజెన్సీ పేర్కొంది. ఆర్‌బీఐ లైసెన్సులు లేకుండా విప్స్ సంస్థలు పనిచేస్తున్నాయని, ప్రజల నిధులను ఎస్క్రో ఖాతాలకు బదులుగా నేరుగా కంపెనీ ఖాతాల్లోకి సేకరించారని ఈడీ ఆరోపించింది.
అయితే ఆ వ్యాపారాలు చట్టబద్ధమైన ఎంఎల్‌ఎం, రియల్ ఎస్టేట్ వెంచర్లని డిఫెన్స్ వాదించింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితులపై చర్యలు తీసుకోవడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని గుర్తించి నోటీసులు జారీ చేసింది. అయితే నిందితులను అరెస్టు చేయకపోవడం..వారి కోసం రెడ్ కార్నర్, లుక్ అవుట్ మార్గాలలో ప్రయత్నించకపోవడంతో ..ఈ కేసు ఎప్పటికి కొలిక్కి వస్తుంది..బాధితుల సొమ్ము ఎప్పుడు రికవరీ అవుతుందన్నదానిపై తీవ్ర అయోమయం నెలకొంది.
నల్లగొండ కేసు వెరీ స్పెషల్…
అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ అంటూ విప్స్(విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ) అధినేత వినోద్ తుకారాం ఖుటే, ఆయన ఏజెంట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టిన మోసంపై 2025లో ఏప్రిల్ 14న నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసుల ఆలసత్వాన్ని అలుసుగా తీసుకున్న విప్స్ కంపెనీ నిర్వహకులు ఈ జిల్లాతో పాటు దేశ వ్యాప్తంగా మరోసారి వేవ్ పేరుతో మళ్లీ రూ.లక్ష డిపాజిట్ చేస్తే పాత డబ్బులు కలిపి ఇస్తామంటూ మరో మోసానికి తెరతీశారు. ఈ క్రమంలో మేల్కొన్న పోలీసులు గతేడాది ఏప్రిల్ 12న విప్స్ సంస్థకు చెందిన 15మందిపై కేసు నమోదు చేసి..రిమాండ్ చేశారు. వారు బెయిల్ పై దర్జాగా బయట తిరుగుతున్నారు. ఎలాగు కేసు విచారణలో ఉందని, కోర్టులో తేలేది ఎప్పుడోనని, ఇంతకుమించి మమ్మల్ని చేసేదేముందని నిందితులు తమకేమి పట్టనట్లుగా డిపాజిటర్లకు ముఖం చాటేస్తున్నారు. దీంతో మాకు డబ్బులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. డిపాజిటర్లలో సామాన్య ప్రజలు, నల్లధనం వ్యాపారులు, పోలీసు ఉద్యోగులు సైతం ఉన్నారు. బాధితుల్లో కొందరు హైదరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ లోనూ ఫిర్యాదు చేశారు.
మోసమే లక్ష్యంగా విప్స్ గ్రూప్ స్థాపన..
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొల్హాపూర్, పూణే, నాసిక్‌లలోని పలు ప్రాంతాలలో ఉన్న VIPS గ్రూప్ ఆఫ్ కంపెనీలైన మెస్సర్స్ గ్లోబల్ అఫిలియేట్ బిజినెస్, మెస్సర్స్ కానా క్యాపిటల్, రియల్ గోల్డ్ క్యాపిటల్ మరియు ఫీనిక్స్ FX లలో సోదాలు నిర్వహించింది. మే 2వ తేదీన ప్రారంభమైన ఈ ఆపరేషన్లలో నకిలీ పామ్, మల్టీ-లెవల్ మార్కెటింగ్ పథకాలతో పాటు చట్టవిరుద్ధమైన ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై విప్స్ వ్యాపారాలు కొనసాగుతున్నాయని దర్యాప్తులో భాగంగా వెల్లడైంది.
ప్రజల డిపాజిట్లు..వ్యక్తిగత ఆస్తులుగా మార్పు…
పెట్టుబడిదారుల నుండి సేకరించిన నిధులను, లావాదేవీల అక్రమ స్వభావాన్ని దాచిపెట్టడానికి షెల్ కంపెనీలు, బూటకపు ఖాతాల ద్వారా మళ్లించినట్లు వినోద్ ఖుటేపై ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత, నియంత్రణ సంస్థల పరిశీలనను తప్పించుకుంటూ, మనీలాండరింగ్‌కు వీలు కల్పిస్తూ, క్రిప్టోకరెన్సీకి బదులుగా హవాలా ఆపరేటర్ల ద్వారా ఆ నిధులను భారతదేశం నుండి దుబాయ్‌కు బదిలీ చేశారు. రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా వేయబడిన ఈ నేర ఆదాయాన్ని వినోద్ ఖుటే తన వ్యక్తిగత అవసరాల కోసం, తన కంపెనీల రోజువారీ వ్యవహారాలను నడపడానికి, దుబాయ్‌తో పాటు భారతదేశంలో ఆస్తులను కొనుగోలు చేయడానికి వినియోగించుకున్నారు.
వినోద్ ఖుటే అక్రమ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి మెస్సర్స్ వీఐపీఎస్ వాలెట్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ వీఐపీఎస్ ట్రేడ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (మెస్సర్స్ వీటీఎఫ్‌పీఎల్), మెస్సర్స్ కానా క్యాపిటల్స్ లిమిటెడ్, మెస్సర్స్ గ్లోబల్ అఫిలియేట్ బిజినెస్ (జీఏబీ), వీఐపీఎస్ సెక్యూరిటీస్, వీఐపీఎస్ ప్రాపర్టీస్ వంటి పలు కంపెనీలను స్థాపించినట్లు ఈడీ గుర్తించింది. నిందితుడు దుబాయ్‌కు చెందిన ‘కాన్ క్యాపిటల్’ అనే కంపెనీని ఆన్‌లైన్ ప్రజెంటేషన్లు, వర్చువల్ సమావేశాల ద్వారా ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌గా ప్రచారం చేశాడు.
89.54కోట్ల మేరకు జప్తు
దర్యాప్తు క్రమంలో వినోద్ ఖుటేతో సంబంధం ఉన్న బహుళ కోట్ల మనీలాండరింగ్ నెట్‌వర్క్‌ను ఈడీ దాడులు వెలికితీశాయి. ఈ చట్టవిరుద్ధ పథకాలలో పెట్టుబడి పెట్టేలా ప్రజలను ప్రలోభపెట్టడంలో పాలుపంచుకున్న పంపిణీదారుల నెట్‌వర్క్‌ను ఈడీ తన సోదాల్లో వెలికితీసింది. సోదాల సందర్భంగా, ఈడీ అధికారులు సుమారు రూ. 5 కోట్ల విలువైన నగదు, బ్యాంకు నిధులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆభరణాలు, వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్‌లో నివసిస్తున్న వినోద్ ఖుటే ఈ అక్రమ కార్యకలాపాల వెనుక సూత్రధారి అని దర్యాప్తులో వెల్లడైంది. మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై వినోద్ తుకారాం ఖుటే, సంతోష్ ఖుటే, మంగేష్ ఖుటే, కిరణ్ పితాంబర్ అనరసే, అజింక్య బదాధే , ఇతరులపై పూణేలోని భారతీ విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది.
వినోద్ ఖుటేకు సంబంధించి భారత్ పూణే, అహ్మదాబాద్, ముంబైలలోని వివిధ ప్రాంతాలలో, ధరాశివ్, కొల్హాపూర్, సాంగ్లీ జిల్లాలో, దుబాయ్ లలో ఈడీ విచారణలో గుర్తించిన.. వినోద్ ఖుటే ,అతని బంధువుల వివిధ బ్యాంకు బ్యాలెన్స్‌లు, స్థిరాస్తులను దాదాపుగా 89.54కోట్ల మేరకు జప్తు చేశారు. గత మే నెలలో కోర్టు నిందితులకు జారీ చేసిన సమన్ల వరకు ఈడీ దర్యాప్తు కొనసాగింది.
