ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రచారం కేసులో సినీ నటి నిధి అగర్వాల్ నేడు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు గాను సినీనటి నిధి అగర్వాల్‌ను ఈడీ ప్రశ్నించనుంది. హవాలా ద్వారా డబ్బులు స్వీకరించినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈడీ ముందుకు విచారణకు హాజరుకావాల్సి వచ్చింది.ఈరోజు ఆమె స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేయనున్నారు.
బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్రపై ఈడీ విచారణ కొనసాగిస్తుంది. మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. సెలబ్రిటీలు ప్రకటనల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రమోట్ చేశారని, తద్వారా ప్రజలను అందులో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారని తన ఫిర్యాదులో ఫణీంద్ర శర్మ పేర్కొన్నారు.అధికారులు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో నిధి అగర్వాల్‌తో పాటు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, అనన్య నాగళ్ల సహా మొత్తం 21 మంది సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లను కూడా చేర్చారు.
నిషేధిత బెట్టింగ్ యాప్స్‌కు సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు ఇస్తూ.. యువతను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగాఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద దర్యాప్తు చేపట్టింది. సెలబ్రిటీలు తీసుకున్న పారితోషికాలు, ఆర్థిక లావాదేవీలు,డిజిటల్ ట్రైల్స్‌పై అధికారులు తీవ్రమైన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించిన ఈడీ త్వరలోనే మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.