Wah Rashi Waterfalls | వావ్ అనిపించే.. వా రాశి పర్యాటక కేంద్రం

మేఘాలయ ఖాసీ కొండల్లోని వా రాశి పర్యాటక కేంద్రం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. జలపాతాలు, అడవులు, లివింగ్ రూట్ వంతెనలు, ఖాసీ సంస్కృతి అందాలతో మంత్ర ముగ్ధులవుతారు.

Wah Rashi Waterfalls | వావ్ అనిపించే.. వా రాశి పర్యాటక కేంద్రం

విధాత : ప్రకృతి ఆరాధకులకు ఉత్తమ పర్యాటక కేంద్రాల జాబితాలో ప్రత్యేకంగా నిలుస్తుంది వారాశి పర్యాటక కేంద్రం. మేఘాలయలోని ఖాసీ హిల్స్ జిల్లాలోని తూర్పు సింటుంగ్ గ్రామం పరిధిలో ఉండే ఖాసీ కొండలలో వా రాశి పర్యటక కేంద్రం ప్రకృతి అందాలకు నెలవుగా పర్యటకులకు ఆకట్టుకుంటుంది. వారాశి సందర్శించిన వారు అక్కడ అందమైన కొండలు, జల పాతాలు, లోయలు, అడవులను చూసి వావ్ అనకుండా ఉండలేరు. అద్బుత కొండ ప్రాంతాలు, అడవులు..కొండల మీదుగా జాలువారే జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తూ మనస్సుకు ఆహ్లాదాన్ని..హాయిని అందిస్తున్నాయి. పొగమంచుతో కూడిన అడవులు, కొండల మార్గంలో ట్రెక్కింగ్ చేస్తూ..ఐకానిక్ లివింగ్ రూట్ వంతెనను సందర్శిస్తూ..చెట్ల వేర్ల నుండి తయారు చేయబడిన శతాబ్దాల నాటి సహజ వంతెనల మీదుగా సాగుతూ పృకృతి అందాలను వీక్షించవచ్చు.

ఎన్నో సందర్శన స్థలాలు

మావ్స్మై, సిజు గుహలు వంటి మనోహరమైన సున్నపురాయి గుహలు, వార్డ్స్ సరస్సు, ఎలిఫెంట్ ఫాల్స్, నోహ్కాలికై, వీ సావ్డాంగ్, ఎలిఫెంట్ జలపాతం వంటి సెవెన్ సిస్టర్స్ అద్భుతమైన జలపాతాలను వీక్షించవచ్చు. షిల్లాంగ్ శిఖరం, వర్షాన్ని ప్రేమించేవారి స్వర్గం చిరపుంజి (సోహ్రా), డాన్ బాస్కో మ్యూజియంప స్కై వ్యూ టవర్ వంటి వాటిని చూసి తీరాల్సిందే. కేఫ్ హాపింగ్, పోలీస్ బజార్‌లో షాపింగ్ చేయడం ప్రత్యేకంగా ఉంటుంది. డాకి – క్రిస్టల్-క్లియర్ రివర్ మ్యాజిక్, వెదురు నడక మార్గాలు, పూల తోటలు, స్వచ్ఛమైన నీటితో అద్దంలా అడుగు కూడా కనిపించే ఉమ్న్‌గోట్ నదిలో బోటింగ్‌ ప్రత్యేకమైంది. మావ్‌ఫ్లాంగ్ పురాతన అడవులు, నాంగ్రియాట్ ట్రెక్కర్స్ డిలైట్ లను సందర్శించి పులకించవచ్చు.

పురాతన సంస్కృతులతో పరిచయం

స్థానిక పురాతన తెగల ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగడం అద్వితీయ అనుభూతిని అందిస్తుంది. ఇక్కడి ఖాసీ తెగ ప్రజలు మాతృస్వామిక కుటుంబ వ్యవస్థను అనుసరిస్తుండగా..వారి వంటకాల రుచులు మైమరిపిస్తాయి. ఖాసీలు ఆగ్నేయాసియా నుండి వలస వచ్చి శతాబ్దాలుగా ఖాసీ, జయంతియా కొండలలో నివసిస్తున్నారని కథనం. చాలా మంది ఖాసీలు ఇప్పుడు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నప్పటికి వారి పురాతన ఆనిమిస్టిక్ పద్ధతులు కూడా కొనసాగుతున్నాయి. షాద్ సుక్ మైన్సియం వంటి జానపద నృత్యాలు, దుయితారా వంటి స్థానిక వాయిద్యాలు ఖాసీ సంస్కృతికి ప్రాణం పోస్తాయి.