స్పీకర్‌ ఎవరు? మళ్లీ ఓం బిర్లాకే ఇస్తారా? ప్రొటెం స్పీకర్‌గా కే సురేశ్‌?

తన ప్రభుత్వ మనుగడ ఇతర భాగస్వామ్య పార్టీల మీద ఆధారపడి ఉన్నదని తెలిసినా.. బీజేపీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే కీలక పోర్టుఫోలియోలను బీజేపీ నేతలకే ఇచ్చుకున్న మోదీ.. స్పీకర్‌ పోస్టును కూడా తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి

స్పీకర్‌ ఎవరు? మళ్లీ ఓం బిర్లాకే ఇస్తారా? ప్రొటెం స్పీకర్‌గా కే సురేశ్‌?

న్యూఢిల్లీ : తన ప్రభుత్వ మనుగడ ఇతర భాగస్వామ్య పార్టీల మీద ఆధారపడి ఉన్నదని తెలిసినా.. బీజేపీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే కీలక పోర్టుఫోలియోలను బీజేపీ నేతలకే ఇచ్చుకున్న మోదీ.. స్పీకర్‌ పోస్టును కూడా తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి మెజార్టీ లేని నేపథ్యంలో భాగస్వామ్యపక్షాలను మచ్చిక చేసుకునేందుకు కొన్ని కీలక పదవులు ఇస్తుందని భావించినా.. అది వాస్తవరూపం దాల్చలేదు. స్పీకర్‌ పోస్టును భాగస్వామ్య పార్టీలకు ఇస్తారనే ఊహాగానాలు చెలరేగినా.. అవి కూడా ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. గత లోక్‌సభ స్పీకర్‌, రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసారి ఎన్నికైన ఓం బిర్లాను మరోసారి కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ పోస్టుపై టీడీపీ కూడా ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మోదీ తొలి ప్రభుత్వంలో సుమిత్రా మహాజన్‌కు బీజేపీ అవకాశం ఇచ్చింది. ఆమె 2014 నుంచి 2019 వరకూ స్పీకర్‌గా కొనసాగారు.

స్పీకర్‌ పోస్టుకు అభ్యర్థి ఎవరన్న విషయాన్ని బీజేపీ ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా.. ఓం బిర్లా ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే.. ఈ విషయంలో ఎన్డీయే మిత్ర పక్షాల మధ్య ఇంకా చర్చలు కొసాగుతున్నట్టు చెబుతున్నారు. ఓం బిర్లా మరోమారు ఎన్నికైతే రెండు పూర్తికాలాలు స్పీకర్‌గా కొనసాగిన రెండో వ్యక్తిగా నిలుస్తారు. కాంగ్రెస్‌ నేత బలరాం జక్కర్‌ గతంలో 1989 నుంచి పదేళ్లపాటు స్పీకర్‌గా కొనసాగారు. రెండో దఫా స్పీకర్‌గా ఎంఏ అయ్యంగార్‌, జీఎస్‌ ధిల్లాన్‌, జీఎంసీ బాలయోగికి అవకాశం వచ్చినా వివిధ కారణాలతో వారి రెండో దఫా పదవీకాలం అసంపూర్తిగానే ముగిసింది. బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్న హిందీ రాష్ట్రమైన రాజస్థాన్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటం ఓం బిర్లాకు సానుకూల అంశంగా చెబుతున్నారు.

స్పీకర్‌ పేరును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జూన్‌ 26న ప్రతిపాదిస్తారు. ఆ పేరును ఎన్డీయే పక్షాలు బలపరుస్తాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే పక్షాలతో మాట్లాడి, ఒప్పించే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు అప్పగించారు. ఏకాభిప్రాయంతోనే స్పీకర్‌ను ఎన్నుకోవాలనే అభిప్రాయంతో బీజేపీ ఉన్నది. బీజేపీ మెజార్టీ మార్కు చేరుకోలేక పోయిన నేపథ్యంలో ఎన్డీయే పక్షాల్లో ట్రబుల్‌ షూటర్‌గా రాజ్‌సాథ్‌ సింగ్‌ పాత్ర మరింత బలంగా మారింది. ఇప్పటికే మంగళవారం తన నివాసంలో ఎన్డీయే పక్షాల నేతలతో రాజ్‌నాథ్‌సింగ్‌ సమావేశం కూడా నిర్వహించారు. ఓం బిర్లాతోపాటు డీ పురందేశ్వరి, భర్తృహరి మహతాబ్‌ (వీరిద్దరూ ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినవారు), ఏడు దఫాలు ఎంపీగా గెలిచిన రాధామోహన్‌సింగ్‌ పేర్లు కూడా స్పీకర్‌ పదవికి రేసులో ఉన్నవారి జాబితాలో ఉన్నట్టు తెలుస్తున్నది.

అయితే.. మెజార్టీ కోసం భాగస్వామ్యపక్షాలపై ఆధారపడి నేపథ్యంలో స్పీకర్‌ ఎన్నిక బీజేపీకి కీలకం కానున్నది. బీజేపీ నిర్ణయాన్ని తిరస్కరించకపోయినా.. ప్రభావితం చేసే స్థాయిలో ఎన్డీయేలోని కీలక భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీయూ ఉన్నాయి. అయితే.. జేడీయూ ఇప్పటికే తాము బీజేపీ ఎంపిక చేసే నేతకు మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది. టీడీపీ మాత్రం ఈ అంశంలో తన వైఖరిని బయటపెట్టలేదు. మౌనంగా ఉంటున్నది. ఏకాభిప్రాయంతో స్పీకర్‌ ఎన్నిక జరగాలనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోసం గతంలో పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీకి ఉన్న నేపథ్యంలో టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తున్నది. అందుకు సాక్షాత్తూ టీడీపీ కూడా బాధితురాలే.

2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబు కూడా ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పారు. లోక్‌సభ స్పీకర్‌ను ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రతిపక్షం డిప్యూటీ స్పీకర్‌ పోస్టును డిమాండ్‌ చేస్తున్నది. తాము స్పీకర్‌ పోస్టుకు కూడా పోటీ చేస్తామని సంకేతాలు ఇస్తున్నది. గత లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్‌ను కూడా నియమించలేదు. అయితే.. ముందుగా ఎన్డీయేలో ఏకాభిప్రాయం సాధించేందుకు డిప్యూటీ స్పీకర్‌ పోస్టును మాత్రం భాగస్వామ్యపక్షాలకు బీజేపీ ఇవ్వొచ్చన్న చర్చ జరుగుతున్నది.

స్పీకర్‌ను ఎన్నుకునే ముందు ప్రొటెం స్పీకర్‌ను ఎంపిక చేస్తారు. సాధారణంగా సభలో సీనియర్‌ సభ్యుల్లో ఒకరికి ఈ బాధ్యత అప్పగిస్తారు. ఆయన ప్రధాని సహా ఎంపీలుగా ఎన్నికైన సభ్యులందరి చేత లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయిస్తారు. స్పీకర్‌ ఎన్నిక కూడా ఆయన సారథ్యంలోనే నిర్వహిస్తారు. సభలో సీనియర్‌ ఎంపీల పేర్లతో లోక్‌సభ సచివాలయం ఒక జాబితాను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి అందజేస్తుంది. అందులో నుంచి ఒక పేరును ఎంపిక చేస్తారు. ఆయనతో రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయిస్తారు.

ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న సభ్యుల్లో అత్యంత సీనియర్‌ సభ్యుడిగా కాంగ్రెస్‌కు చెందిన కే సురేశ్‌ ఉన్నారు. ఆయన ఎనిమిది పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా సురేశ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరుగుతున్నది. 2014లో ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ వ్యవహరించారు. ఆయన తొమ్మిది పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 2019లో 8 పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన మేనకాగాంధీ ఉన్నప్పటికీ.. వీరేంద్రకుమార్‌ను (ఏడుసార్లు ఎంపీగా గెలిచారు) బీజేపీ ఎంపిక చేసింది.

సభలో బలాబలాలు, స్పీకర్‌ ఎన్నికకు పోటీ పెట్టే ఆలోచనలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఉన్న నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌ పదవి కీలకం కానున్నది. ప్రతిపక్ష ఎంపీకి ప్రొటెం స్పీకర్‌ పదవి ఇస్తే ప్రభుత్వంపై అది ప్రభావం చూపుతుందని భావిస్తే.. ఇతర సీనియర్‌ సభ్యులైన మహతాబ్‌ లేదా రాధామోహన్‌కు ఆ బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నది. ఒకవేళ ప్రతిపక్షం పోటీ పెట్టినా.. సంఖ్యాబలం రీత్యా ఎన్డీయే అభ్యర్థి గెలుస్తాడనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంటే ప్రతిపక్ష సభ్యుడికి అవకాశం దక్కొచ్చు. మోదీ తొలి ఎన్డీయే సమావేశంలోనే ఇకపై సమిష్టి నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు. ప్రతిపక్షం బలంగా ఉన్న నేపథ్యంలో మూడోసారి ప్రభుత్వాన్ని నిర్వహించనున్న మోదీ.. స్పీకర్‌ ఎన్నిక విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నదాన్ని బట్టి.. ఆయన భవిష్యత్తు పనితీరును అంచనా వేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.