రాహుల్ గాంధీ పెళ్లి పలు సందర్భాల్లో చర్చకు వస్తూనే ఉంటుంది. సోమవారం రాయల్బరేలీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ప్రస్తావనకు వచ్చింది.
రాయ్‌బరేలీ: రాహుల్ గాంధీ పెళ్లి పలు సందర్భాల్లో చర్చకు వస్తూనే ఉంటుంది. సోమవారం రాయల్బరేలీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ప్రస్తావనకు వచ్చింది. ‘రాహుల్ భయ్యా.. పెళ్లెప్పుడు?’ అని ప్రశ్నించగా.. జనం హోరులో అది సరిగ్గా వినిపించలేదు. ‘మీరు చెప్పేది నాకు వినిపించడం లేదు.. అంటూ రాహుల్ దాటవేసేందుకు ప్రయత్నించారు.
అయితే.. పక్కనే ఉన్న సోదరి ప్రియాంక గాంధీ కల్పించుకుని.. ఆ యువకుడు ఏం అడుగుతున్నాడో రాహుల్‌కు వివరించింది. దాంతో ఒక్కసారిగా నవ్వేసిన రాహుల్.. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని బదులిచ్చాడు. తన తల్లి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. దేశవ్యాప్తంగా రాహుల్ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న తరుణంలో ఇక్కడ తన సోదరుడి బాధ్యతను తన భుజాలపై వేసుకుని ప్రియాంక ప్రచారం చేస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావించిన రాహుల్.. వేదికపై ఉన్న తన సోదరి ప్రియాంకను దగ్గరకు పిలిచి.. ఆప్యాయంగా ఆమె ముఖాన్ని తాకి.. తన సోదరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. దీనికి స్పందించిన ప్రియాంక.. ఎన్ని కేసులు పెట్టినా వెనుకంజ వేయని ధీరుడు తన సోదరుడని చెప్పారు. దేశంలో సత్యం కోసం పోరాడుతున్నాడని కీర్తించారు.