Jyothirlinga | భారత్‌లో ప్రసిద్ధి చెందిన 12 జ్యోతిర్లింగాలు.. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏ పేర్లతో పిలుస్తారు?
Jyothirlinga | మహాశివుడు స్వయంగా వెలసిన క్షేత్రాలను జ్యోతిర్లింగాలు అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ క్షేత్రాల్లో పరమేశ్వరుడిని ఏ పేరుతో పిలుస్తారో తెలుసుకుందాం..
Jyothirlinga | మహాశివుడు స్వయంగా వెలసిన క్షేత్రాలను జ్యోతిర్లింగాలు అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ క్షేత్రాలను దర్శించడం ద్వారా పాపవిమోశనం జరిగి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. మరి ఈ 12 జ్యోతిర్లింగాలు భారత్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ క్షేత్రాల్లో పరమేశ్వరుడిని ఏ పేరుతో పిలుస్తారో తెలుసుకుందాం..

సోమనాథ జ్యోతిర్లింగాలయం
దేశంలోనే తొలి జ్యోతిర్లింగంగా భావించే సోమనాథ ఆలయం గుజరాత్ రాష్ట్రం సౌరాష్ట్ర జిల్లాలో సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణుడు తన లీలతో వెలగించిన దీపం నేటికి ప్రజ్వరిల్లుతుండటం ఇక్కడ ప్రత్యేకత. చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథుడిని దర్శించుకుంటే పాపాలు పోతాయని నమ్ముతారు. చంద్రుడు (సోముడు) స్వయంగా ఈ క్షేత్రాన్ని ప్రతిష్ఠించడంతో దీన్ని సోమనాథ ఆలయం అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం
ఏపీలోని కర్నూలు జిల్లాలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. హైదరాబాద్‌కు కేవలం 230 కి.మీ. దూరంలోనే ఈ ఆలయం ఉంది. ఈ క్షేత్రం అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటి కావడం మరో విశేషం. ఇక్కడ పరమేశ్వరుడు గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు.

ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది. ఈ నగరంలో ఏడు సాగర తీర్థాలు, 28 తీర్థాలు, 87 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండము ఉన్నాయి. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభు జ్యోతిర్లింగంగా ఇది ప్రసిద్ధి.

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర ఆలయం ఉంది. వింద్య పర్వత సానువుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఒకటే లింగం రెండు భాగాలు ఉండి.. రెండు పేర్లతో పూజింపబడటం విశేషం.

వైద్యనాథ్ జ్యోతిర్లింగం
పట్నా నుంచి సుమారు 220 కి.మీ. దూరంలో వైద్యనాథ్ ధామం ఉంది. ఇక్కడ పరమశివుడిని వైద్యుడిగా ఆరాధిస్తారు. దీర్ఘకాలిక రోగాల నివారణ కోసం ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

భీమశంకర ఆలయం
మహారాష్ట్రలోని పశ్చిమఘాట్ అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. పుణేకి సుమారు 110కి.మీ. దూరంలో ఉంది. కుంభకర్ణుడి కుమారుడు అయిన భీమాసురుడిని సంహరించిన ప్రాంతంగా దీన్ని పురాణాల్లో పేర్కొన్నారు.

రామేశ్వరం
తమిళనాడులోని రామేశ్వర ఆలయం ఉంది. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించిన కారణంగా దీనికి రామేశ్వరంగా ప్రసిద్ధి చెందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.

నాగనాథేశ్వర ఆలయం
మహారాష్ట్రలోని ప్రభాస రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ నాగనాథేశ్వర ఆలయం ఉంది. నాగులకు అధిపతిగా ఇక్కడ శివుడిని ఆరాధిస్తారు. పరమేశ్వరుడి నాగేశ్వరుడు లేదా నాగనాథేశ్వరుడు అని పిలుస్తారు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి.

కాశీ విశ్వనాథ ఆలయం
ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వేశ్వరం మోక్షపురిగా ప్రసిద్ధి. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీ పట్టణమని అంటుంటారు. ఇక్కడ భక్తులకు శివుడు మోక్షం ప్రసాదిస్తాడని విశ్వసిస్తుంటారు.

త్రయంబకేశ్వరం
మహారాష్ట్రలోని నాసిక్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో త్రయంబకేశ్వరాలయం ఉంది. బ్రహ్మావిష్ణువుల ప్రార్థనలతో మహాశివుడు స్వయంభువుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.

కేదార్‌నాథ్
ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల్లో ఉన్న పవిత్ర క్షేత్రం కేదార్‌నాథ్ కేదారేశ్వర ఆలయం. మందాకిని నదీతీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరీకుండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరం గుర్రాలపై లేదా డోలీలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ఆలయాన్ని సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరుస్తారు.

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహల సమీపంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. దీన్ని 12వ జ్యోతిర్లింగంగా భావిస్తారు.
ఒకే ట్రిప్ ప్లాన్
ఈ 12 జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్‌లో దర్శించుకోవాలని అనుకునేవారికి యాత్రికులు మంచి రూట్ మ్యాప్‌ను చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లాలని అనుకుంటే ముందుగా శ్రీశైలలం మల్లికార్జున ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అనంతరం తమిళనాడులోని రామేశ్వర ఆలయం సందర్శించవచ్చు. ఆ తర్వాత మహారాష్ట్రకు వస్తే.. భీమాశంకర్, త్రయంబకేశ్వర, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాలు చూడవచ్చు. అనంతరం గుజరాత్ వెళ్లి సోమనాథ, నాగేశ్వర జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌లో కేదారనాథ్, యూపీలో కాశీ, జార్ఖండ్‌లో వైద్యనాథుడిని దర్శించుకోవచ్చు.
Read More:
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram