Telangana Bar Council | బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో 41 శాతం చెల్లని ఓట్లు.. అవి కూడా రెండు బాక్సుల్లోనివే!!

తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 109 బాక్సులకు గాను మొదటి రోజు 2 బాక్సులు ఓపెన్‌ చేసి.. ఓట్లు లెక్కిస్తే.. అందులో 41 శాతం ఓట్లు చెల్లలేదు. న్యాయవాదులు అయి ఉండి కూడా ఓటు వేయడం రాకపోవడమేంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

  • By: TAAZ |    news |    Published on : Feb 11, 2026 5:34 PM IST
Telangana Bar Council | బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో 41 శాతం చెల్లని ఓట్లు.. అవి కూడా రెండు బాక్సుల్లోనివే!!

Telangana Bar Council | లాయర్లంటే బాగా చదువుకున్నవాళ్లు.. ఎలాంటి కేసులనైనా వాదించగల సమర్థులు.. తర్కం తెలిసినవాళ్లు.. అని చెప్పుకొంటూ ఉంటారు. కానీ.. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల ఓటింగ్‌ తీరును గమనిస్తే.. ఈ అభిప్రాయం మార్చుకోవాలేమో! 2026 జనవరి 30న తెలంగాణ బార్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 109 పోలింగ్‌ స్టేషన్ల నుంచి బ్యాలెట్‌ బాక్సులు హైదరాబాద్‌కు కౌంటింగ్‌ నిమిత్తం తరలి వచ్చాయి.

మంగళవారం ఉదయం నుంచి హైకోర్టు ప్రాంగణంలోని బార్‌ కౌన్సిల్‌ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మందగమనంతో సాగింది. ఆ విషయాన్ని పక్కన పెడితే.. తొలి రోజు రెండు బాక్సుల్లోని ఓట్లను లెక్కించగా.. వచ్చిన ఫలితాలు.. కౌంటింగ్‌ హాల్‌లో కూర్చున్నవారికి దిమ్మతిరిగేలా చేశాయి. మొత్తం 109 బాక్సులకు గాను రెండు బాక్సులు ఓపెన్‌ చేసి.. అందులో 498 ఓట్లను లెక్కించారు. ఈ ఓట్లలో ఏకంగా 204 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 294 ఓట్లను చెల్లినట్టుగా ప్రకటించారు. అంటే.. 41 శాతం ఓట్లు చెల్లకుండా పోయాయని న్యాయవాద వర్గాల ద్వారా తెలుస్తున్నది.
ఓటు వేసే సమయంలో ప్రాధాన్యాలను ఎంచుకోవడంలో, అక్షర దోషాలు ప్రధానంగా ఓట్లు చెల్లక పోవడానికి కారణంగా తెలుస్తున్నది. పలు బ్యాలెట్‌ పత్రాలపై ‘ONE’,’TWO’, THREE’ అనే పదాల్లో సైతం కరెక్షన్స్‌ ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ ఉన్న వివరాల ప్రకారం.. ఎంఏకే ముఖీద్‌, పొన్నం అశోక్‌ గౌడ్‌, సీ దామోదర్‌ రెడ్డి, జాకిర్‌ హుస్సేన్‌ జవేదీ, మధుసూదన్‌రావు, హనుమంత్‌ రెడ్డి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని సమాచారం.

రెండు బాక్సుల్లోనే 41 శాతం ఓట్లు చెల్లకుండా పోవడం న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాజంలో కీలకమైన న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్లు సైతం సక్రమంగా ఓటు వేయకపోవడం విచిత్రమేనని పరిశీలకులు అంటున్నారు. సాధారణంగా చదువు రాని వారు, లేదా మొదటిసారి ఓటింగ్‌లో పాల్గొంటున్నవారు ఇలా పొరపాట్లు చేస్తే సరిపెట్టుకోవచ్చు.. కానీ.. లాయర్లు అయి ఉండి కూడా ఓటు వేయలేకపోవడం దారుణమని సీనియర్‌ న్యాయవాదులు అంటున్నారు. మరి మిగిలిన 107 బాక్సులు తెరిస్తే ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని నిట్టూర్చుతున్నారు.

దాదాపు ఎనిమిది సంవత్సరాల అనంతరం బార్‌ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించారు. హైకోర్టుతోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బరిలో మొత్తం 203 మంది అభ్యర్థులు నిలిచారు. రాష్ట్రంలోని 134 బార్‌ అసోసియేషన్‌ల నుంచి సుమారు 35వేల మంది రిజిస్టర్డ్‌ అడ్వొకేట్స్‌కు గాను.. 85 శాతానికపైగా ఓటింగ్‌లో పాల్గొన్నట్టు తెలుస్తున్నది. ప్రాధాన్య క్రమంలో నిర్వహించిన ఓటింగ్‌లో అత్యధిక ఓట్లు సాధించిన 23 మంది అభ్యర్థులు తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యులుగా ఎంపికవుతారు. మరో ఇద్దరు మహిళలను కోఆప్ట్‌ చేయనున్నారు.