Viral: రెండు కాళ్లు.. చేయి లేవు! కానీ డెలివరీ బాయ్‌గా విధి రాతను ఎదురించాడు

  • By: sr    news    Apr 11, 2025 1:45 PM IST
Viral: రెండు కాళ్లు.. చేయి లేవు! కానీ డెలివరీ బాయ్‌గా విధి రాతను ఎదురించాడు

విధాత: ఆత్మవిశ్వాసం.. సంకల్ప బలముంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు.. విధి రాతకు ఎదురీదవచ్చంటారు. ఇందుకు నిదర్శనమన్నట్లుగా మ‌హారాష్ట్ర‌కు చెందిన‌ ఓ దివ్యాంగ యువకుడు తనకు రెండు కాళ్లు, కుడి చేయి లేకపోయినా అధైర్య పడకుండా బతుకు పోరాటాన్ని సాగిస్తూ విధిరాతను తిరగరాశాడు. స్ఫూర్తిదాయకమైన తన జీవనోపాధి పోరాటంతో ప్రతికూల పరిస్థితులకు తలొగ్గిపోయి నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకు సిద్ధపడే మానసిక.. శారీరక దుర్భలులకు ఆదర్శంగా నిలిచాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రమాదంలో రెండుకాళ్లు, కుడి చేతిని పోగొట్టుకున్న ఆ యువకుడు తాను ఇంకేమి పనిచేస్తాననుకుని ఇంట్లో కూర్చోలేదు. కుటుంబ సభ్యులపై ఆధార పడలేదు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో బతుకు పోరాటానికి సిద్ధమయ్యాడు. ఇందుకు తను మానసిక, శారీరక శక్తిని కూడగట్టుకున్నాడు. కృత్రిమ కాళ్ల సహాయంతో నడక మొదల పెట్టడంతో పాటు ఎడమచేతి వైపు బ్రేక్ లు అమర్చిన స్కూటీని నడపడంపై కసరత్తు చేశాడు. ఆ తర్వాత జొమాటోలో డెలివరీ బాయ్ గా పనిచేయడం ప్రారంభించాడు. నిత్యం తన ఒంటి చేతితో తనే స్వయంగా కంపెనీ టీ షర్ట్ వేసుకుని, కృత్రిమ కాళ్లు అమర్చుకుని, సొంతంగా స్కూటి నడుపుతూ డోర్ డెలివరీ పనులు కొనసాగిస్తున్నాడు.

ఇందుకోసం తన ఎడమ చేతిని బలంగా ఉంచుకునేందుకు జీమ్ కు వెళ్లి కసరత్తు కూడా చేసి సిక్స్ ప్యాక్ బాడీ కూడా సాధించాడు. ఆ యువకుడి నిత్య జీవన పోరాట దృశ్యాలతో కూడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆ దివ్యాంగ యువకుడి జీవన పోరాటాన్ని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. వేల స్ఫూర్తిదాయక ప్రసంగాల కంటే కూడా అతడి జీవన పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రశంసిస్తున్నారు. మ‌నం కూడా ఆ దివ్యాంగ యువకుడి జీవన పోరాటాన్ని చూసి జీవితానికి కావాల్సిన స్ఫూర్తిని తీసుకోవాలి.