పెళ్లైన మూడు రోజులకే యుద్దానికి..! భారత్ మాతాకీ జై నినాదాలతో నవ వధువు వీడ్కోలు

  • By: sr    news    May 10, 2025 3:20 PM IST
పెళ్లైన మూడు రోజులకే యుద్దానికి..! భారత్ మాతాకీ జై నినాదాలతో నవ వధువు వీడ్కోలు

విధాత: పాకిస్తాన్ తో ఉద్రికత్తల నేపథ్యంలో భారత సైనికుల సెలవులు రద్దు చేసి వెంటనే విధుల్లో చేరాలన్న ఆదేశాలతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సెలవుల్లో ఉన్న సైనికులు హుటాహుటిన విధుల్లో చేరుతున్నారు. ఇంటికొచ్చిన సైనికులను వారి తల్లిదండ్రులు, భార్యలు, కుటుంబ సభ్యులు వీర తిలకాలు దిద్ది భావోద్వేగాల మధ్య బార్డర్ కు పంపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓ సైనికుడికి తన పెళ్లయిన మూడో రోజునే బార్డర్ నుంచి పిలుపు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాల మధ్య అతడిని విధులకు పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

మహారాష్ట్రకు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న వివాహం జరిగింది. వివాహ సెలవుల మీద ఉన్న జవాన్‌ మనోజ్ పాటిల్‌కు భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బార్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది. దీంతో మనోజ్ భార్య యామిని ‘నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్‌కు పంపుతున్నా’ అంటూ కన్నీటితో పంపించింది.

పెళ్ళైన మూడు రోజులకే తిరిగి బార్డర్‌కు వెళ్లడంతో మనోజ్ పాటిల్ భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రైలు వద్దకు వచ్చి మనోజ్ పాటిల్ కు నవ వధువు.. భార్య యామిని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వందే మాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో వీడ్కోలు పలికారు.