Tirumala | మళ్లీ.. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కలకలం!

విధాత: శ్రీవారి ఆలయంపై మరోసారి డ్రోన్ కెమెరా కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన భక్తుడు దాదాపుగా 10 నిమిషాలు శ్రీవారి ఆలయం, పరిసరాలపై డ్రోన్ కెమెరా వినియోగించాడు. ఫిర్యాదు అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు భక్తుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆలయం పైనుంచి డ్రోన్లు, విమానాలు ఎరగకూడదన్న సంప్రదాయం ఉన్నప్పటికి తరుచు విమానాలు శ్రీవారి ప్రధానాలయం మీదుగా ప్రయాణిస్తున్నాయి. తిరుమల శ్రీవారి గర్భాలయం ఆనంద నిలయంపై విమానాల ప్రయాణం ఆగమ శాస్త్ర విరుద్ధం. అందుకే స్వామివారి ఆలయం పై నుంచి విమానాల రాకపోకలను భక్తులు, ఆగమ పండితులు తీవ్రంగా నిరసిస్తున్నారు. భక్తుల నమ్మకాలను, మనోభావాలను గమనించి తిరుమల ఆలయ పరిసరాలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్ కొన్నాళ్లుగా వినిపిస్తుంది.
ఈ మేరకు పలుమార్లు టీటీడీ సైతం కేంద్ర విమానయాన శాఖను కోరినప్పటికి ప్రయోజనం లేకపోయింది. రేణిగుంట విమానాశ్రయంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించేందుకు సాధ్యం కాదని.. అయితే ఆలయానికి సమీపంలో విమానాల రాకపోకలు సాగకుండా చూస్తామని కేంద్రం గతంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ కేంద్ర విమానయాన సంస్థ నుంచి ఈ దిశగా చర్యలు వెలువడలేదు. గతేడాది జూన్ 7న, అక్టోబర్ 21న ఒకసారి.. ఈ ఏడాది జనవరి 2న, మార్చి 27న కూడా కూడా తిరుమల ఆలయం మీదుగా విమానం వెళ్లింది. ఇలా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లిన ప్రతిసారి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కేంద్ర విమానయాన శాఖకు సమాచారం అందిస్తున్నారు. విమానాల, హెలికాప్టర్లు ఆలయం మీదుగా వెళ్లకుండా చూడాలని అభ్యర్థిస్తున్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి లేఖ రాశారు. త్వరలోనే నో ఫ్లయింగ్ జోన్ పై అధ్యయనం చేసి..సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.