వేములవాడ రాజన్నఆలయ పునర్నిర్మాణం శాస్త్ర ప్రకారమే…దర్శనాల నిలిపివేత : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
శృంగేరి పీఠాధిపతుల సూచనలతో శాస్త్ర ప్రకారం రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
- రాజన్న ఆలయ అభివృద్ధి శాస్త్ర ప్రకారమే
- భక్తుల భద్రత దృష్ట్యా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు
- మీడియాతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
విధాత, వేములవాడ: శృంగేరి పీఠాధిపతుల సూచనలతో శాస్త్ర ప్రకారం రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. సీఎం మార్గదర్శకత్వంలో రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే రూ.47 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. ఆలయ విస్తరణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయంగా భీమేశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలు దర్శనాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భీమేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రూ.3.40 కోట్లతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని వివరించారు. పట్టణ ప్రజలు ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు ప్రముఖుల సూచనలను ఇప్పటి వరకు పరిగణలోకి తీసుకున్నామన్నారు.
రాజన్న ఆలయంలో 64 నుండి 70 పిల్లర్లతో కొత్త మండపాల నిర్మాణం జరుగుతోందని పెద్ద మిషన్లను ఉపయోగించాల్సి వస్తుందని అందువల్ల భక్తుల భద్రత దృష్ట్యా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాజన్న ఆలయం మూసివేయబడిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, నిత్య పూజలు సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధి ఒక్కరి ఎజెండా కాదని.. ఇది రాజన్న భక్తుల ఎజెండా అని పేర్కొన్నారు. శతాబ్దం పాటు వచ్చే భక్తులందరికీ సౌకర్యాలు వసతులు కల్పించడానికి ఈ పనులు జరుగుతున్నాయని.. భక్తులు సహకరించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram