Aus Vs Ind: ఆసీస్ ఆశలకు గండి.. గబ్బా టెస్టు డ్రా

  • By: sr    news    Dec 19, 2024 9:26 AM IST
Aus Vs Ind: ఆసీస్ ఆశలకు గండి.. గబ్బా టెస్టు డ్రా
  • కరుణించని వరుణుడు..
  • టీమిండియా 8/0 స్కోరు వద్ద వదలని వర్షం
  • ఆటను రద్దు చేస్తూ అంపైర్ల నిర్ణయం
  • ప్లేయర్ ఆప్ ద మ్యాచ్ గా ట్రావిస్ హెడ్
  • సిరీస్ లో 1-1తో సమంగా ఆసీస్, భారత్

బ్రిస్బేన్( ఆస్ట్రేలియా): బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య జరిగిన మూడో టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో ఊహించట్లుగానే గబ్బా టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్ వేగంగా ఆడిన ఆసీస్ జట్టు 7 వికెట్ల నష్టానికి 89 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని భారత్ ఎదుట 275 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌ 8/0 స్కోరుతో ఉన్నప్పుడు వర్షం వచ్చింది. ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 260 పరుగులే చేయగలిగింది. ఐదు టెస్టుల సిరీస్‌లో చెరొక విజయంతో, సిరీస్‌ లో 1-1తో రెండు జట్లు సమంగా నిలిచాయి. నాలుగో టెస్టు మ్యాచ్‌ మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి (బాక్సింగ్‌ టెస్టు) ప్రారంభం కానుంది.

ఆసీస్ ఆశలకు గండి

తొలుత ఓవర్‌నైట్ స్కోరు 252/9తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ తన చివరి వికెట్ ను త్వరగానే చేజార్చుకుంది. ఓవర్ నైట్ స్కోరు మరో 8 రన్స్‌ను జోడించి 260 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్‌ దీప్‌ (31) చివరి వికెట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. జస్‌ప్రీత్ బుమ్రా (10*) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆసీస్‌కు 185 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఐదోరోజు టీమిండియాను రెండు సెషన్లలోపే ఆలౌట్ చేసి విజయం సాధించాలని ఆస్ట్రేలియా జట్టు భావించినా ..వర్షం వదలకుండా కురవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి.

వర్షం కారణంగా తొలి సెషన్‌లో దాదాపు గంటన్నర ఆట సాధ్యపడలేదు. దీంతో రెండో సెషన్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. సాధ్యమైనంత ఎక్కువగా పరుగులు చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు వేగంగా ఆడాడు. కానీ, భారత బౌలర్ల దెబ్బకు వారి పప్పులు ఉడకలేదు. ఏ బ్యాటర్ నూ క్రీజులో కుదురుకోనీయకుండా టీమిండియా బౌలింగ్ దళం పెవిలియన్‌కు చేర్చింది. ఆఖర్లో ట్రావిస్ హెడ్ (17), అలెక్స్ కేరీ (20*), పాట్ కమిన్స్ (22) భారీషాట్లకు దిగడం కాస్త కలిసొచ్చింది. కమిన్స్‌ ఔటైన వెంటనే ఆసీస్ తన ఇన్నింగ్స్‌ను 89/7 స్కోరు వద్ద డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. . భారత బౌలర్లు బుమ్రా 3, సిరాజ్ 2, ఆకాశ్‌ దీప్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యం సాధించిన ఆసీస్‌.. రెండో ఇన్నింగ్స్‌తో కలిపి భారత్‌ ఎదుట 275 పరుగులను లక్ష్యంగా ఉంచింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అద్భుత సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.