Ponnam Prabhakar | రైతులు, ప్రజలకు.. మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా

విధాత, హనుమకొండ: రాష్ట్రంలో రైతులు, ప్రజలకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగపూర్ శివారులో 33/11 కె వి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ల సమక్షంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ భూమిపూజ చేసిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ మెరుగైన విద్యుత్ కోసం రూ. 2.14 కోట్ల వ్యయం తో విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నివాసాలకు, వ్యవసాయానికి అందించే విద్యుత్ సరఫరాలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేవన్నారు. అప్రకటిత విద్యుత్తు కోతలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. 14 నెలలుగా అనేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సేవలను అందిస్తుండగా రాజకీయంగా విమర్శలు చేస్తున్నారని, అది సరైనది కాదన్నారు. విద్యుత్ ఉప కేంద్రానికి భూములు ఇచ్చిన రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ధాన్యం కొనుగోలు సమయంలో తాలు పేరుతో కటింగ్ పెట్టే వారిని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా అది కూడా చాలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ గట్ల నర్సింగాపూర్ లో విద్యుత్ ఉపకేంద్రం రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు మెరుగైన విద్యుత్ సేవలు అందుతాయన్నారు. ఈ సందర్భంగా టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యుత్ అంతరాయం ఉండదన్నారు. అన్ని విద్యుత్ కేంద్రాలను ఆటోమేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విద్యుత్ ఉపకేంద్రానికి భూములు ఇచ్చిన రైతులతో పాటు విద్యుత్ శాఖ అధికారులకు రైతులకు మంత్రి చేతుల మీదుగా సన్మానం చేశారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, స్థానిక తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో వీరేశం, విద్యుత్ శాఖ అధికారులతో పాటు స్థానిక రైతులు ప్రజలు పాల్గొన్నారు.