Telangana | భూదాన్ భూముల కేసు.. IAS, IPSలకు హైకోర్టులో బిగ్ షాక్!

  • By: sr    news    Apr 30, 2025 3:16 PM IST
Telangana | భూదాన్ భూముల కేసు.. IAS, IPSలకు హైకోర్టులో బిగ్ షాక్!

Telangana | Bhoodan Case

విధాత: భూదాన్ భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని హైకోర్టు జస్టిస్ భాస్కర్ రెడ్డి సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని ఐఏఎస్, ఐపీఎస్ లు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వుల నిలుపుదల చేయడానికి నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మహేశ్‌ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా, తరుణ్‌ జోషి, రాహుల్‌ హెగ్డె సహా ఇతర అధికారులు అప్పీల్ పిటిషన్ వేశారు. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఆఫీసర్ల తరపు న్యాయవాదులు కోరారు. భూదాన్ భూమికి ఆఫీసర్ల భూమికి ఎలాంటి సంబంధం లేదని వాదించారు.

భూదాన్ భూమి ఉన్నది కేవలం సర్వే నెంబర్ 181,182 లో మాత్రమేనని, ఆఫీసర్లు కొన్న భూమి నాగారం సర్వే 194లో 366 ఎకరాల్లో ఉందని తెలిపారు. సింగిల్ బెంచ్ జడ్జి వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఆఫీసర్లు భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టాలని ఉతర్వులు ఇచ్చారని..ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరారు. ఆది భూదాన్ భూమి కాదు ప్రభుత్వ, పట్టా భూమి అని ప్రతివాదు న్యాయవాది రవి చందర్ వాదించారు. అదే విషయాన్ని సింగిల్ బెంచ్ దగ్గర ప్రస్తావించాలని..కేసులో తదుపరి వాదనలు అక్కడే వినిపించాలని ఐఏఎస్, ఐపీఎస్ తరుపు న్యాయవాదులకు హైకోర్టు సూచించింది.

వివాదంలోకి వెళితే..

భూదాన్‌ భూముల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మెుత్తం 74 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ప్రతివాదుల జాబితాలో 27మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఉన్నారు.

దీనిపై జస్టిస్‌ సీవీ భాస్కర్‌ రెడ్డి ఏప్రిల్‌ 24న విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం ప్రాథమికంగా రికార్డులను పరిశీలిస్తే నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూములు భూదాన్‌ బోర్డుకు చెందినవని తేలుతోందని స్పష్టం చేశారు. పిటిషన్‌లో ఉన్నత అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని సింగిల్ బెంచ్ జడ్జి పేర్కొన్నారు.

హైకోర్టు తన విచక్షణాధికారంతో సామాజిక ఆస్తి పరిరక్షణలో భాగంగా ఈ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా ఆ సర్వే నంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఆ భూముల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయరాదని, అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని ప్రతివాదులను ఆదేశించారు. ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలున్న నేపథ్యంలో పిటిషన్​ను ఉపసంహరించుకోవడానికి పిటీషనర్​కు అనుమతించబోమని పేర్కొన్నారు. అనుమతిలేకుండా ఉపసంహరణకు అనుమతించరాదని రిజిస్ట్రిని కూడా ఆదేశించారు.

ఇందులో ప్రతివాదులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, భూదాన్ యజ్ఞ బోర్డు, సీసీఎల్ఎలతోపాటు సీబీఐ, ఈడీలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులైన ఐఏఎస్, ఐపీఎస్ లు, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలనే ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పలువురు ఐపీఎస్‌లు హైకోర్టును ఆశ్రయించారు.