Cm Revanth Reddy: తెలంగాణకు గొప్ప కీర్తీ.. చాకలి ఐలమ్మ యూనివర్సిటీ!

Chakali Ilamma University| telangana | Cm Revanth Reddy
విధాత : కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం తెలంగాణకు గొప్ప కీర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం (Chakali Ilamma University)లో నూతన భవన నిర్మాణాలకు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో ఈ యూనివర్సిటీ పోటీ పడాలన్నారు. అన్ని రంగాల్లో మహిళా యూనివర్సిటీ విద్యార్థులు రాణించి రాజీవ్ గాంధీ కలల్నినిజం చేయాలని కోరారు.
ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే సందర్భం రాబోతుందన్నారు. అందులో మీ ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని ఆదర్శంగా నిలబడుతున్నారన్నారు. ఈ యూనివర్సిటీలో చదువుకోవడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమని చెప్పారు. రెండున్నరేళ్లలో యూనివర్సిటీలో నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు. నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అని..చదువుల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకు రావాల్సిన బాధ్యత మీది అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేస్తున్నానని.. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించామని తెలిపారు. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదు.. వారు వ్యాపారవేత్తలుగా రాణిస్తారని ప్రభుత్వం వారిని ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా ప్రోత్సహిస్తోందన్నారు. అదానీ, అంబానీలతో వ్యాపారంలో మహిళలు పోటీపడేలా కార్యాచరణ తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.