సకాలంలో బిల్లులు చెల్లించినా క్రెడిట్ స్కోర్ ఎందుకు పెరగడం లేదు?
క్రెడిట్ కార్డు బిల్లులు లేదా ఈఎంఐలు సకాలంలో చెల్లించినా కూడా కొందరికీ క్రెడిట్ స్కోర్ పెరగదు. అయితే దీనికి పలు రకాల కారణాలున్నాయి. ఈ కారణాలు తెలుసుకొంటే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు
క్రెడిట్ కార్డు బిల్లులు లేదా ఈఎంఐలు సకాలంలో చెల్లించినా కూడా కొందరికీ క్రెడిట్ స్కోర్ పెరగదు. అయితే దీనికి పలు రకాల కారణాలున్నాయి. ఈ కారణాలు తెలుసుకొంటే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. క్రెడిట్ స్కోర్ పెరిగితేనే బ్యాంకుల్లో రుణాలు సులభంగా వస్తాయి. మీరు ఆర్ధికంగా ఎంత క్రమశిక్షణగా ఉన్నారో మీ క్రెడిట్ హిస్టరీ చెబుతోంది.
క్రెడిట్ స్కోర్ ఎందుకు పెరగదంటే?
మీ క్రెడిట్ స్కోర్ పెరగడానికి పలు అంశాలను దోహదం చేస్తాయి. క్రెడిట్ స్కోర్ పెరగడం, తగ్గడం అనేది క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే సీయూఆర్ పై ఆధారపడి ఉంటుంది. మీ క్రెడిట్ పరిమితి లక్ష రూపాయాలు ఉందనుకుందాం. అందులో మీరు 30 శాతం మాత్రమే వినియోగించాలి. అంతకంటే ఎక్కువ వినియోగిస్తే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ కార్డు పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ ఉపయోగించి సకాలంలో బిల్లులు చెల్లించినా ఉపయోగం ఉండదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. రుణాల్లో వైవిధ్యత ఉన్నప్పుడే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. అంటే వ్యక్తిగత రుణం, హోమ్ లోన్, ఇతర రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఉంది. ఇలా అప్పుల చేసి సకాలంలో చెల్లించకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.
గత చరిత్ర కూడా
గతంలో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించకపోయినా లేదా ఆలస్యంగా చెల్లించినా అది మీ క్రెడిట్ హిస్టరీపై చూపుతాయి. ఇది మీ క్రెడిట్ హిస్టరీ నివేదికలో ఏడేళ్ల పాటు ఉంటుంది. ఇది కూడా మీ క్రెడిట్ స్కోర్ పై గణనీయంగా ప్రభావం చూపుతుంది. అంతేకాదు తక్కువ సమయంలోనే ఎక్కువగా రుణాల కోసం ధరఖాస్తులు చేయడం కూడా మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రుణాలతో పాటు కొత్త క్రెడిట్ కార్డు కోసం ధరఖాస్తు చేసినా కూడా అది క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేస్తుంది. అంటే క్రెడిట్ స్కోర్ ను తగ్గించే అవకాశం ఉంది. హౌజింగ్ లోన్ల వంటి సెక్యూర్డ్ రుణాలు, క్రెడిట్ కార్డుల నుంచి తీసుకొనే అన్ సెక్యూర్డ్ రుణాలు మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతాయి. అంటే సెక్యూర్డ్ లోన్ల మీదే ఆధారపడడం, అన్ సెక్యూర్డ్ లోన్లపైనే ఆధారపడడం వంటివి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది.
క్రెడిట్ నివేదికలో లోపాలు
గతంలో క్రెడిట్ కార్డును రద్దు చేసుకోవడం. తిరిగి కొత్త క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల కూడా మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపుతుంది. అంటే మీ క్రెడిట్ హిస్టరీ కాలపరిమితి తగ్గుతుంది. ఇది కూడా మీ క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. అంతేకాదు గతంలో మీరు రుణాలు చెల్లించినా కూడా ఏదో కారణాలతో ఆ ఖాతా అలాగే కొనసాగడం కూడా ఇబ్బందే. మీరు మూసివేసినా లేదా రద్దు చేసినా ఖాతాలు కూడా యాక్టివ్ గా ఉండడం వల్ల అవి కూడా క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతాయి. లేదా మీ పేరుతో ఎవరైనా లోన్ తీసుకొని చెల్లించకున్నా అవి కూడా ప్రమాదమే. తరచుగా మీ సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ ను చెక్ చేసుకొంటే ఎవరైనా మీ పేరు మీద లోన్ తీసుకున్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో క్రెడిట్ హిస్టరీ రిపోర్టు తప్పుగా ఉంటే కూడా అది మీ క్రెడిట్ హిస్టరీపై ప్రమాదం చూపే అవకాశం ఉంది. ఈ విషయాన్ని క్రెడిట్ స్కోర్ ను నమోదు చేసే సంస్థల దృష్టికి తీసుకెళ్లి క్రెడిట్ హిస్టరీని మెరుగుపర్చుకోవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram