IND vs NZ ODI | న్యూజీలాండ్​తో తొలి వన్డేలో భారత్​ ఘనవిజయం – కోహ్లీ, గిల్​ అర్థసెంచరీలు

వడోదరాలో జరిగిన తొలి వన్డేలో భారత్ 301 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. కోహ్లీ, గిల్ అర్థసెంచరీలు మ్యాచ్‌కు బలమైన పునాది వేయగా, చివర్లో రాహుల్–రాణా–సుందర్ నింపాదిగా ఆడి భారత్‌కు ఘన విజయాన్ని అందించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్​లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

  • By: ADHARVA |    sports |    Published on : Jan 11, 2026 10:48 PM IST
IND vs NZ ODI | న్యూజీలాండ్​తో తొలి వన్డేలో భారత్​ ఘనవిజయం – కోహ్లీ, గిల్​ అర్థసెంచరీలు

India Beat New Zealand as Kohli, Gill Lead 301-Run Chase

సారాంశం: 301 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆత్మవిశ్వాసంగా చేధించింది. కోహ్లీ, గిల్ అర్థసెంచరీలు జట్టుకు బలమైన పునాది వేయగా, చివర్లో కేఎల్ రాహుల్–వాషింగ్టన్ సుందర్ జంట చాకచక్యంగా ఆడి మ్యాచ్‌ను భారత్ వైపుకు తిప్పింది. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యం సాధించింది.

 

విధాత క్రీడా విభాగం | హైదరాబాద్​:

న్యూజీలాండ్​తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్​లో భాగంగా వడోదరాలో జరిగిన మొదటి మ్యాచ్​లో భారత్​ విజయదుంధుభి మోగించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన కివీస్​ విసిరిన 301 పరుగుల లక్ష్యాన్ని భారత్​ ఇంకో ఓవర్​ మిగిలుండగానే ఛేదించి సిరీస్​లో 1–0తో ముందంజ వేసింది.

విరాట్​ – శుభమన్​ : బలంగా నిలబడ్డారు

భారీ లక్ష్యఛేదనకు  బరిలోకి దిగిన భారత్​ ఆరంభంలో కొంచెం ఇబ్బందిపడినా, తర్వాత హిట్​మ్యాన్​ రోహిత్​ బౌండరీలతో గాడిలో పడింది. మరోపక్క కెప్టెన్​, ఓపెనర్​ శుభమన్​ గిల్​ ప్రారంభంలో తడబడ్డా, కాసేపటికి కుదురుకుని సింగిల్స్​తో పరుగుల వేగం పెంచాడు. జట్టు పరుగులు 39 వద్ద ఉన్నప్పుడు రోహిత్​(26) అవుట్​ కాగానే క్రీజ్​లోకి వచ్చిన కింగ్​ కోహ్లీ ఆట స్వరూపాన్నే మార్చేసాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ కొండంత లక్ష్యాన్ని అలవోకగా కరిగించాడు. కెప్టెన్​తో కలిసి రెండో వికెట్​కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లీ, గిల్​ అర్థ సెంచరీ(56 పరుగులు, 2 సిక్స్​లు, 3 ఫోర్లు) చేసి ఔటయ్యాక, శ్రేయస్​ అయ్యర్​తో ఇన్నింగ్స్​ను కొనసాగించాడు. 234 పరుగుల వద్ద కోహ్లీ(93 పరుగులు, 1 సిక్స్​, 8 ఫోర్లు) దురదృష్టవశాత్తు త్రుటిలో సెంచరీ చేజార్చుకుని అవుటవగా, అయ్యర్​(49) అర్థసెంచరీ మిస్సయ్యాడు. భారత్ 13 బంతుల వ్యవధిలో కోహ్లీ, జడేజా, శ్రేయస్ అయ్యర్ వికెట్లను కోల్పోయింది. కేఎల్​ రాహుల్​, హర్షిత్​ రాణా మిగిలిన ఆటను ముగించే దశకు చేరుకున్నాక రాణా(29) పెవిలియన్​ చేరుకున్నాడు. క్రీజ్​లోకి వచ్చిన వాషింగ్టన్​ సుందర్​తో కలిసి రాహుల్​(29*) మిగిలిన లాంఛనాన్ని పూర్తిచేసాడు. భారత్​ లక్ష్యఛేదనలో భాగంగా 6 వికెట్లు కోల్పోయినా, అందులో 3 వెంటవెంటనే పోగొట్టుకున్నా, ఎక్కడా తడబడకుండా గమ్యాన్ని చేరుకోవడం విశేషం.

‘ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్’​ విరాట్​ కోహ్లీ ప్రపంచ రికార్డులు

Virat Kohli celebrates his half-century during India’s run chase in the IND vs NZ 1st ODI at Vadodara

ఇదే మ్యాచ్​లో విరాట్​ కోహ్లీ  మరో అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 28వేల అంతర్జాతీయ పరుగులు సాధించిన తొలి బ్యాటర్​గా రికార్డులకెక్కాడు.  అంతేకాకుండా మొత్తంగా అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. మొదటి స్థానంలో మాస్టర్​ సచిన్​ టెండుల్కర్​ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

న్యూజీలాండ్​ బౌలర్లలో కైల్​ జేమీసన్​ విజృంభించి 4 వికెట్లు తీసుకోగా, ఈ మ్యాచ్​ ద్వారా అరంగేట్రం చేసిన ఇద్దరు ఆటగాళ్లు ఆదిత్య అశోక్​, క్రిస్టియన్​ క్లార్క్​ తలా ఒక వికెట్​ తీసుకున్నారు.

ఓపెనింగ్​, ఫినిషింగ్​ అదరగొట్టిన న్యూజీలాండ్​

అంతకుముందు, టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్​కు దిగిన కివీస్ ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఓపెనర్లు డెవాన్ కాన్వే 56, హెన్రీ నికల్స్ 62 పరుగులు చేసి మొదటి వికెట్‌కు 117 పరుగులు జత చేశారు. ఈ భాగస్వామ్యం వల్ల భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే మధ్య ఓవర్లలో హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి, కాన్వే–నికల్స్ ఇద్దరినీ పెవిలియన్‌కు పంపించాడు. అక్కన్నుంచి వికెట్లు కూలడం మొదలైంది. ఒక దశలో 117/0 తో ఉన్నకివీస్​ కాసేపటికి 198/5కి పడిపోయింది. ఈ దశలో జట్టును నిలబెట్టింది డారిల్ మిచెల్. 71 బంతుల్లో 84 పరుగులు (5 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి న్యూజిలాండ్ స్కోరును మళ్లీ గాడిలో పెట్టాడు. చివర్లో తొలి మ్యాచ్​ ఆడుతున్న క్రిస్టియన్ క్లార్క్ 24 పరుగులు చేసి జట్టును 300 పరుగులకు చేర్చాడు.

New Zealand’s Daryl Mitchell after scoring 84 and Kyle Jamieson celebrating a wicket in the IND vs NZ 1st ODI

భారత్ బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ తలో రెండు వికెట్లు తీసుకోగా, సిరాజ్, కుల్దీప్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో మూడు మ్యాచ్​ల సిరీస్​లో భారత్​ 1 – 0 తో ముందడుగు వేసింది. రెండో వన్డే ఈనెల 14న రాజ్​కోట్​లో జరుగనుంది.