USA | అమెరికాలో.. ఏపీ విద్యార్థిని మృతి

విధాత: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థిని దుర్మరణం చెందింది. గుంటూరులోని రాజేంద్రనగర్ వంగవోలుకు చెందిన దీప్తి (23) కొన్నాళ్ల క్రితం టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. ఈనెల 12న రోడ్డుపై నడచి వెళ్తున్న దీప్తి(23)ని వేగంగా వెలుతున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దీప్తి తలకు తీవ్రం గాయం కాగా, స్నేహితురాలు స్నిగ్ధ స్వల్ప గాయాలతో బయటపడింది. వారిని చికిత్సకోసం హాస్పిటల్‌లో చేర్పించారు. దీప్తి స్నేహితులు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. ఆయన గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంప్ ఆఫీసును సంప్రదించగా..ఈ సమాచారాన్ని అమెరికాలో ఉన్న పెమ్మసానికి తెలియజేశారు. వెంటనే పెమ్మసాని తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు.
గుంటూరులో ఉన్న పెమ్మసాని సోదరుడు రవిశంకర్ తన స్నేహితుడు నవీన్ కు క్రౌడ్ ఫండింగ్ వచ్చేలా చూడాలని సూచించారు. దాంతో ఆన్ లైన్ లో విరాళాల రూపంలో 80వేల డాలర్ల వరకు రావడంతో ఆ డబ్బును చికిత్సకు వినియోగించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చనిపోయింది. శనివారానికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు పెమ్మసాని రవిశంకర్ తెలిపారు. ఎన్నో ఆశలు పెట్టుకుని అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లిన తమ కూతురు దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.