Gopichand 33rd film | గోపీచంద్ 33వ చిత్రం ‘శూల’.? శివ తత్వం, చరిత్ర, దేశభక్తి మిళితమై భారీ యుద్ధ గాథ

  • By: TAAZ    news    Jul 03, 2025 6:06 PM IST
Gopichand 33rd film | గోపీచంద్ 33వ చిత్రం ‘శూల’.? శివ తత్వం, చరిత్ర, దేశభక్తి మిళితమై భారీ యుద్ధ గాథ

Gopichand 33rd film | పటిష్టమైన యాక్షన్ పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన గోపీచంద్, ఇప్పుడు తన 33వ సినిమాతో ఓ కొత్త ప్రయోగానికి సన్నద్ధమవుతున్నారు. ‘ఘాజీ’, ‘అంతరిక్షం 9000 KMPH’ సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చరిత్ర, మైథాలజీ, దేశభక్తి అనే మూడింటినీ మిళితం చేస్తూ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం పేరే ఇప్పుడు హాట్ టాపిక్. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘శూల’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పేరు వినగానే అందరికీ శివుడి త్రిశూలం గుర్తుకు వస్తుంది. టైటిల్​ను చూస్తే పురాణాల ప్రసక్తి ఉంటుందనే అంచనాలు నెలకొంటున్నాయి. అయితే, ఈ టైటిల్ కథలోని ఓ ముఖ్యమైన ప్రదేశాన్ని సూచిస్తోందనీ, ఆ ప్రాంతానికి కథలో కీలక ప్రాధాన్యత ఉందని చిత్రబృందం చెబుతోంది.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ హిస్టారికల్ డ్రామాలో గోపీచంద్ ఇప్పటివరకు ఎన్నడూ చేయని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఈ విషయాన్ని సూచిస్తోంది. అందులో నుదిటిపై తిలకంతో, పొడవాటి జుట్టుతో, మంచు కొండల్లో యోధుడిలా కనిపించిన గోపీచంద్ లుక్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.

ఈ చిత్రం 7వ శతాబ్దం నేపథ్యంలో జరిగిన ఓ నిజమైన చారిత్రక ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోందని సమాచారం. భారతదేశ చరిత్రలో మరుగునపడిన ఓ గొప్ప ఘటనను తెరపైకి తీసుకురావాలన్న సంకల్ప్ రెడ్డి లక్ష్యంతో ఈ చిత్రాన్ని డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన గత సినిమాల మాదిరిగానే, ఇందులో కూడా దేశభక్తి ప్రధాన అంశంగా ఉండబోతోంది.
ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. ‘గోపీచంద్33’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. త్వరలో టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతటితో కాదు, టైటిల్ కొత్తదై ఉండడం, గోపీచంద్ గెటప్ విభిన్నంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా విజయాన్ని అన్వేషిస్తున్న గోపీచంద్‌కు ఈ సినిమా హిట్ అందిస్తుందా? అన్నది వేచి చూడాల్సిన విషయం.