Seethakka: మహిళా దినోత్సవ కానుక.. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 విడుదల

- ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో విడుదల చేయనున్న సీఎం రేవంత్
- మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
- అన్ని రంగాల్లో మహిళలు పురోగతి సాధించాలి: రాష్ట్ర మంత్రి సీతక్క
విధాత ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి పథం వైపు తీసుకెళ్ళడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka ) ఆధ్వర్యంలో మహిళా అభివృద్ధి, సంక్షేమంతో పాటు సాధికారత లక్ష్యంగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా గత ఏడాది వివిధ పనులు చేపట్టిన సర్కారు, ఈ ఏడాది ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పేరుతో అన్ని రంగాల్లోని మహిళలకు ప్రాధాన్యత నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇందిరా మహిళా శక్తి మిషన్- 2025 విడుదల చేసేందుకు సన్నాహం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందికి తగ్గకుండా మహిళలను సమీకరించి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సభలోనే ఈ మిషన్ ను విడుదల చేయనున్నారు. ఈ మిషన్ లో మహిళా స్వయం సహాయక బృందాల విజయాలు, భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించారు. ప్రధానంగా మహిళల ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన, సంపదసృష్టి పై ఫోకస్ పెట్టారు. ఐకమత్యమే మహాబలం అనే నానుడిని నిజం చేసేలా ఒకే గొడుగు కిందకు గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాలను తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు కేబినేట్ సమావేశం ఆమోదించిన విషయం తెలిసిందే. స్వయం సహాయక సంఘాల పరిధిని విస్తృతపరిచేలా సభ్యుల అర్హత వయసు పెంచారు. కిశోర బాలికలు, వయోవృద్ధుల ఆర్థిక భద్రత, సామాజిక మద్దతు కోసం నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటు చేయాలని నిర్ధేశించారు. సభ్యుల కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించేందుకు, గరిష్ట వయసు 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచారు.
ఇందిరా మహిళా మిషన్ లక్ష్యాల సాధన
తెలంగాణ మహిళా శక్తికి మరింత ఊతమిచ్చేలా ఈ మిషన్ అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మహిళా సంఘాలకు రూ. 21,632 కోట్ల రుణాలందిచారు, 2,25,110 సూక్ష్మ, మధ్య తరహా సంస్థల ఏర్పాటు చేశారు. రూ. 110 కోట్లతో 22 జిల్లాల్లో చురుకుగా ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు, గ్రామీణ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్ తో అనుసంధానించడం కోసం మాదాపూర్ లోనీ శిల్పారామంలో రూ. 9 కోట్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభించారు. మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించడం ద్వారా రూ. 30 కోట్ల ఆదాయం సాధించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మహిళా సంఘాల ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ఆధ్వర్యంలో ఇప్పటికే రూ. 634 కోట్ల విలువగల 23,701 పనులు సాగుతున్నాయి. మహిళా సంఘ సభ్యులకు రెండు లక్షల రుణ బీమా, 10 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తుండగా 400 మందికి రూ. 40 కోట్ల ప్రమాద బీమా చెల్లించారు. 32 జిల్లాల్లో అందుబాటులోకి 32 మొబైల్ ఫిష్ రిటైల్ ట్రక్కులు, ప్రతి ట్రక్కుపై ఆరు లక్షల సబ్సిడీ అందజేశారు. మహిళా సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహణతో పాటు 32 జిల్లాల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు అందజేశారు.
మహిళలే అసలు సిసలు ఆర్థిక శాస్త్రవేత్తలు
పుస్తకాలలో ఆర్థిక శాస్త్రవేత్తలు ఎందరో ఉంటారు.. కానీ ఆచరణలో, కుటుంబ నిర్వహణలో మహిళలే అత్యున్నత ఆర్థికవేత్తలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరా మహిళా మిషన్ 2025 ద్వారా కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. మహిళ తన కళ్ళ మీద తాను నిలబడాలని సూచించారు. రాజకీయ రంగంతోపాటు అన్ని రంగాల్లో విప్తవాత్మక శక్తిగా ఎదగాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రభుత్వసహకారంతో అపూర్వ విజయాలు సాధిస్తున్నారన్నారు. మహిళా అభివృద్ధితోనే సమాజం ప్రగతి సాధిస్తుందని, రాజ్యాలు సొంతగా ఏలెలా మహిళలు ఎదగాలనీ, వచ్చే మహిళా దినోత్సవం లోపు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రెండు మెట్లు ఎదిగేలా కృషిచేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగిన వివక్షత కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎదిగినా లైంగిక అసమానతలను ఎదుర్కొంటూనే ఉన్నారని చెప్పారు. ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నా మహిళల పట్ల చిన్న చూపు పోవడం లేదన్నారు. లింగ అంతరాలను తుదముట్టిస్తేనే సమాజంలో సమానత్వం సాధ్యమన్నారు. మహిళా అనుకూలంగా అత్యుత్తమ విధానాన్ని రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అన్ని రంగాల్లో మహిళలకు తమ ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. అన్నిరంగాల్లో మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని సీతక్క చెప్పారు.