IRCTC Best Package: రూ.13190కే ఊటీ, కూనూరు చుట్టి రావచ్చు

హైదరాబాద్ నుంచి ఊటీ–కూనూరు దర్శనానికి IRCTC రూ.13,190కే 6 రోజుల ప్యాకేజీ ప్రకటించింది. శబరి ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రయాణం, సైట్‌సీయింగ్, హోటల్ బస వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

IRCTC Best Package: రూ.13190కే ఊటీ, కూనూరు చుట్టి రావచ్చు

పచ్చని ప్రకృతి, అందమైన సరస్సులు, ఎత్తైన కొండల మధ్య ప్రయాణం ఊహించడానికే ఎంత బాగుంతో ఆ ఊహ. అటువంటి ప్రకృతి అందాలకు నెలవైన ఊటీని సందర్శించాలనుకునే వారికోసం IRCTC హైదరాబాద్ నుంచి కేవలం రూ. 13190కే బెస్ట్ ప్యాకేజీని తీసుకువచ్చింది. అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ అనే పేరుతో ఈ నెల 25 నుంచి ఊటీ, కూనూరు అందాలను చూపించేందుకు సిద్ధమైంది. ఈ యాత్ర పూర్తిగా 5 రాత్రులు, 6 రోజులపాటు సాగుతుంది. ఈ ప్రాంతాన్ని చూసేందుకు ప్రతి మంగళవారం సికింద్రాబాద్‌ నుంచి రైలు బయలుదేరుతుంది.

ప్యాకేజీ పూర్తి వివరాలు: మొదటి రోజు అంటే నవంబర్ 25న మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి ట్రైన్ నెంబర్: 20629, శబరి ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. ఈ రైలు నల్లగొండ, గుంటూరు, తెనాలిలో స్టాప్ ఉంటుంది. అవకాశం ఉన్నవారు ఆయా స్టేషన్లలో ఎక్కవచ్చు. రాత్రంతా జర్నీ చేశాక మరుసటి రోజు ఉదయం కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు 9.10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 90కి.మీ దూరంలో ఉన్న ఊటీకి వెళ్తారు. అక్కడ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సందర్శిస్తారు. రాత్రి అక్కడే బస చేసి, మూడవ రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకుని దొడబెట్టా పీక్, టీ మ్యూజియం, పైక్రా ఫాల్స్ చూసి రాత్రికి హోటల్ చేరుకుంటారు. నాలుగవ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని కూనూరు సైట్ సీయింగ్ వెళ్తారు. అది ముగిశాక తిరిగి ఊటీ చేరుకుని రాత్రికి హోటల్‌లో బస చేస్తారు. ఐదవ రోజు ఉదయం టిఫిన్ ఆరగించి హోటల్ నుంచి మధ్యాహ్నానానికి చెక్ అవుట్ అవుతారు. అక్కడి నుంచి మళ్లీ కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌ చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 3.40 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి రాత్రంతా ప్రయాణం చేస్తారు. చివరిగా 6వ రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటారు.

టికెట్ ధరలు:

ఈ ప్యాకేజీలో కంఫర్ట్, స్టాండర్డ్ అనే రెండు రకాలు ఉంటాయి, కంఫర్ట్ టికెట్ తీసుకున్నవారికి రైల్లో 3ఏసీ, హోటళ్లలో ఏసీ గదులు ఏర్పాటు చేస్తారు. స్టాండర్డ్ అయితే రైల్లో స్లీపర్, హోటళ్లలో అయితే నాన్ ఏసీ గదులు అందుబాటులో ఉంటాయి. ఈ యాత్రకు ఒక్కరు మాత్రమే వెళ్లాలి అనుకుంటే కంఫర్ట్ అయితే రూ. 30000, స్టాండర్డ్ అయితే రూ.27450 ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్తే మాత్రం ఒక్కొక్కరికి కంఫర్ట్ రూ. 17070, స్టాండర్డ్ రూ. 14520 చెల్లించాల్సి వస్తుంది. అదే ముగ్గురు కలిసి వెళ్తే మాత్రం ఒక్కొక్కరికి కంఫర్ట్ రూ.15850, స్టాండర్డ్ రూ.13300 చొప్పున చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల పిల్లు ఉంటే కంఫర్ట్‌లో విత్ బెడ్ అయితే రూ.9700, వితౌట్ బెడ్ రూ.9390, స్టాండర్డ్ విత్ బెడ్ రూ.7160, వితౌట్ బెడ్ రూ.6850 చొప్పున చెల్లించాలి.

మరింత సమాచారం కోసం IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.