Kaun Banega Crorepati | `కౌన్ బనేగా కరోడ్ పతి’ షోలో ఆపరేషన్ సిందూర్ మహిళా ఆర్మీ అధికారులు!

కేబీసీ 17 స్వాతంత్ర దినోత్సవ ఎపిసోడ్‌లో ఆర్మీ అధికారులు యూనిఫారంతో హాజరై వివాదం.. ఆర్మీ ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్చ.

Kaun Banega Crorepati | `కౌన్ బనేగా కరోడ్ పతి’ షోలో ఆపరేషన్ సిందూర్ మహిళా ఆర్మీ అధికారులు!

Kaun Banega Crorepati | విధాత: అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) హోస్టింగ్ లో రాబోతున్న కౌన్ బనేగా కరోడ్ పతి(Kaun Banega Crorepati) 17వ సీజన్ లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టెలికాస్ట్‌ కాబోతున్న ప్రత్యేక ఎపిసోడ్‌ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ ప్రోమోను హనరింగ్‌ హీరోస్‌ పేరిట తాజాగా సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌ రిలీజ్‌ చేసింది. ఈ ప్రత్యేక ఎపిసోడ్ లో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) లో కీలక భూమిక వహించిన కర్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sofiya Qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్(Wing Commander Vyomika Singh ), కమాండర్ ప్రేరణా దియోస్తలీ(Commander Prerna Deosthalee) పాల్గొన్నారు. ప్రొమోలో అమితాబ్ బచ్చన్ వీరిని ఘనంగా స్వాగతించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఉద్దేశం ఏంటని ప్రోమోలో అమితాబ్ ప్రశ్నించగా.. దానికి కర్నల్ ఖురేషీ సమాధానమిస్తూ.. పాకిస్తాన్ తరచూ ఉగ్రదాడులు చేస్తోందని..దీనికి ప్రతి స్పందన అవసరమైందని.. అందుకే ఆపరేషన్ సిందూర్ జరిగింది అని తెలిపారు. పంద్రాగష్టున సోనీ టీవీలో సోనీలీవ్‌ ఓటీటీలో ఈ ఫుల్‌ ఎపిసోడ్‌ ప్రసారం కాబోతుంది.

వివాదస్పదంగా మారిన ఆర్మీ అధికారుల వ్యవహారం

అయతే ఆర్మీ అధికారులు పూర్తి యూనిఫారంలో ఓ టీవీ రియాలిటీ షోకు హాజరవ్వడం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర దూమారం..చర్చ సాగుతుంది. ఆర్మీ అధికారులను అలా యూనిఫామ్‌లోనే ఆహ్వానించాల్సిన అవసరం ఉందా? ..ఇందుకు సైనిక ప్రోటోకాల్‌కు అనుమతిస్తుందా? అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నించారు. సైన్యం పీఆర్‌ ఏజెన్సీలా మారిపోయిందా?.. లేకుంటే బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ మైలేజ్‌ కోసం ఇలాంటి పని చేసిందా? అని మరికొందరు విమర్శలు కురిపించారు. భారత సాయుధ దళాలకు ఒక గౌరవం, హుందాతనం ఉన్నాయని… రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటిని నాశనం చేస్తున్నారని.. ఇది సిగ్గుచేటు అని మరికొందరు విమర్శించారు. ఏ దేశంలోనైనా కీలకమైన సైనిక ఆపరేషన్ తర్వాత అధికారులు ఇలా టీవీ షోలలో పాల్గొనడం చూశామా? విధి నిర్వహణలో ఉన్నవారికి ఇలా ఎలా అనుమతిస్తారు? ప్రస్తుత ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం మన సైన్యాన్ని సిగ్గు లేకుండా వాడుకుంటోందని మరికొందరు దుయ్యబట్టారు.

అసలు ఆర్మీ ప్రోటోకాల్ ఏం చెబుతుంది..!

ఆర్మీ డ్రెస్‌ రెగ్యులేషన్స్ ప్రకారం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారిక యూనిఫారాన్ని ధరించడం అనుమతించబడదు. బహిరంగ ప్రదేశాలు అంటే రెస్టారెంట్లు వగైరా.. చివరకు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ ధరించడానికి వీల్లేదు. తాజాగా మలయాళ స్టార్‌ నటుడు తన లెఫ్టినెంట్‌ కర్నల్‌ హోదాను అగౌరవపరుస్తూ.. కేరళ ప్రభుత్వ ప్రచారంలో యూనిఫాంతో కనిపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన ఆ ఆరోపణలు ఖండించారు. అయితే ఇక్కడ ఓ మినహాయింపు ఉందంటున్నారు. కమాండింగ్‌ ఆఫీసర్‌ చేత రాతపూర్వకంగా అనుమతి తీసుకుని.. అనధికారిక కార్యక్రమాలకు యూనిఫాం ధరించి వెళ్లొచ్చని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. బహుశా ఇప్పుడు ఈ ముగ్గురు అధికారులు కూడా అలాగే అనుమతి తీసుకుని కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షోకు హజరై ఉంటారని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ లో రెండు గంటల్లో భారీ వర్షం

రావు బహదూర్ గా సత్యదేవ్ మెస్మరైజ్