Hyderabad Rain Alert| రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ లో రెండు గంటల్లో భారీ వర్షం

Hyderabad Rain Alert| రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ లో రెండు గంటల్లో భారీ వర్షం

Hyderabad rain alert, హైదరాబాద్ : మరో రెండు గంటల్లో హైదరాబాద్ లో అత్యంత భారీ వర్షం(Hyderabad rain alert) పడనున్నట్లుగా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కనీసం 20 సెంటిమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ (IMD) తెలిపింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్ (GHMC red alert).. రేపు ఆరెంజ్ అలర్ట్(Orange alert)జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో నగరవాసులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పలుచోట్ల వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వరద నీటితో డ్రైనేజీలు పొంగుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభుత్వం వర్ష సూచన నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం వరకే విద్యాసంస్థలు నడపాలని ఆదేశించింది.

తెలంగాణ అంతటికీ ఇవాళ, రేపు రెడ్‌ అలర్ట్‌(Telangana heavy rainfall)

తెలంగాణ అంతటికీ బుధ, గురువారాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్ వార్నింగ్‌ జారీ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌, హనుమకొండ, ఆదిలాబాద్‌, జనగామ, కామారెడ్డి, కుమురం భీం, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ కలర్‌ వార్నింగ్‌ జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు

రేపు గురువారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశాం. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని నాగరత్నం పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి’’ అని నాగరత్న తెలిపారు.

ఏపీలోనూ భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం( Bay of Bengal low pressure) 24 గంటల్లో బలపడనున్న నేపథ్యంలో అల్పపీడనం వచ్చే 48 గంటల్లో ఉత్తరకొస్తా దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలో రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు పడుతాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 50నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేసింది.