Konda Surekha | వరంగల్‌ కాంగ్రెస్‌ అంతర్గత పోరులో కీలక ట్విస్ట్‌

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా మంత్రి సురేఖ భర్త కొండా మురళి స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలపై వాడిన పరుషపదజాలంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. మురళి వ్యాఖ్యలపై ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ రెండు జిల్లాల అధ్యక్షులు సమావేశమై కొండాదంపతుల తీరుపై మండిపడ్డారు.

  • By: TAAZ    news    Jun 22, 2025 5:35 PM IST
Konda Surekha | వరంగల్‌ కాంగ్రెస్‌ అంతర్గత పోరులో కీలక ట్విస్ట్‌

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ దంపతులు, ఇతర ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న పంచాయితీ ముదురుపాకాన పడింది. ఈ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ వద్దకు చేరింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్ రావుల వ్యవహార శైలిపై హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షిని ఆదివారం కలిసిన వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా జిల్లాలో అంతర్గతంగా సాగుతున్న విభేదాలు తాజాగా బజారునపడ్డాయి. ఈ మొత్తం పరిణామాలపై జిల్లా ప్రజాప్రతినిధులు మీనాక్షికి వివరించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఆత్మగౌరవానికి భంగం కలిగింది

ఇటీవల మంత్రి భర్త కొండా మురళి సీనియర్ నేతలను కించపరుస్తూ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్‌కు వారు వివరించారని తెలిసింది. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొండా మురళి వ్యాఖ్యలతో తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. మురళితో పాటు సురేఖ వాడిన భాష బాగోలేదన్నారు. కొండా దంపతులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీకి తాము కావాలో… కొండా దంపతులు కావాలో తేల్చుకోవాలని ఒకింత ఆవేదనతో స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలుగకూడదని, ప్రతిపక్షాలకు అనవసర అవకాశం కల్పించకూడదని తాము ప్రయత్నిస్తుంటే మంత్రి దంపతులు ఒంటెత్తు విధానాలతో తమపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారని వివరించారు. పార్టీకి నష్టం కలిగించడమే కాకుండా తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుని గ్రూపులు కడుతున్నారని చెప్పారు. కొండా దంపతుల పై తగిన చర్యలు చేపట్టకుంటే తాము కూడా ఇబ్బందులపాలుకావాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. తమ నియోజకవర్గాల్లో అధికారుల నియామకాల్లో వారికే ప్రాధాన్యతనిస్తున్నారని వివరించారు. మీనాక్షిని కలిసిన వారిలో హనుకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కే. నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి తదితరులు ఉన్నారు.

ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ

వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల ఫిర్యాదు పై స్పందించిన మీనాక్షి తనకు కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిని పూర్తిగా పరిశీలిస్తామని తెలిపారు. ఈ వ్యవహారం పై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తామని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించిలేదని వివరించారు. పీసీసీతో పాటు మంత్రి దంపతులతో కూడా మాట్లాడుతామని, వెంటనే కమిటీని ప్రకటిస్తామని, మొత్తం వ్యవహారం పై విచారణ జరిపిస్తామని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తమ ఇబ్బందులను సీఎం రేవంత్ దృష్టికి తేవాలని భావిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి పార్టీ పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, వేణుగోపాల్ తదితరులకు ఫిర్యాదుల చేయాలని యోచిస్తున్నారు.

కాంగ్రెస్‌లో ముదురు పాకాన విభేదాలు

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా మంత్రి సురేఖ భర్త కొండా మురళి స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలపై వాడిన పరుషపదజాలంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. మురళి వ్యాఖ్యలపై ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ రెండు జిల్లాల అధ్యక్షులు సమావేశమై కొండాదంపతుల తీరుపై మండిపడ్డారు. తమ నియోజకవర్గాల్లో మంత్రి సురేఖ, మురళిలు జోక్యం చేసుకుని గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా దంపతుల ఒంటెద్దుపోకడలతో తమకే కాకుండా పార్టీకి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోందని తేల్చిచెప్పారు. ఈ విషయాలన్నింటిని పార్టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పీసీసీ పరిశీలకున్ని నియమించింది. కాంగ్రెస్ పార్టీ వేదికలపై అంతర్గత చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కాస్తా రోడ్డున పడ్డాయి. ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వెలువెడుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మంత్రి సురేఖ ఇతర ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ వ్యవహారంతో ఇప్పటికే పార్టీ పరువు బజారున పడిందని రానున్న రోజుల్లో పార్టీకి నష్టం వాటిల్లుతోందని పీసీసీతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.