Mavoists | అణచివేతనే నమ్ముకున్న సర్కార్ : కర్రెగుట్టల ముట్టడిపై మావోయిస్టులు
- హింసతో పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నది
- కర్రెగుట్టల ముట్టడి తక్షణ ఆపాలి
- శాంతి చర్యలకు ముందుకు రావాలి
- కర్రెగుట్ట ముట్టడిపై మావోయిస్టు నేత
విధాత ప్రత్యేక ప్రతినిధి:
శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారని, శాంతి చర్చలకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి రూపేశ్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. శాంతి చర్చలకు సంబంధించి తమ పార్టీ కేంద్ర కమిటీ లేఖలు కూడా జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. విశ్వాస రాహిత్యాన్ని తొలగించేందుకు తమవైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరేలా కనిపిస్తోందని అన్నారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ అణచివేత, హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. దీని ఫలితంగా, బీజాపూర్ -తెలంగాణ సరిహద్దులో భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభమైందని తెలిపారు. ఈ ఆపరేషన్ వెంటనే ఆపాలని , బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మార్గం సానుకూల ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. తుపాకీతో సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వం అమలు చేస్తున్న కాగర్ సైనిక్ ప్రచారాన్ని ఒక నెల పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram